Monday, December 23, 2024

1 నుంచి హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం అమలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం జులై 1 నుండి అమలులోకి వస్తుంది. జూన్ 30న మార్కెట్ ముగిసిన తర్వాత రెండు కంపెనీల బోర్డులు వేర్వేరుగా సమావేశాలు జరుపుతాయని హెచ్‌డిఎఫ్‌సి చైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు. అదే సమయంలో హెచ్‌డిఎఫ్‌సి షేర్ల డీలిస్టింగ్ జూలై 13 నుండి అమల్లోకి వస్తుందని హెచ్‌డిఎఫ్‌సి వైస్ చైర్మన్, సిఇఒ కెకి మిస్త్రీ తెలిపారు. అంటే ఈ తేదీ నుండి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి తీసివేస్తారు.

విలీన కంపెనీ షేర్లు జూలై 17 నుంచి ట్రేడ్ అవుతాయి. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2022 ఏప్రిల్ 4న విలీనాన్ని ప్రకటించాయి. విలీనం ద్వారా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 41 శాతం వాటాను హెచ్‌డిఎఫ్‌సి పొందనుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లోని మరిన్ని శాఖలలో హౌసింగ్ లోన్‌లను అందుబాటులో ఉంచడం ఈ విలీనం లక్ష్యంగా ఉంది. మీడియా నివేదికల ప్రకారం, హెచ్‌డిఎఫ్‌సి ఛైర్మన్ దీపక్ పారిఖ్ జూన్ 30న తన ప్రస్తుత పదవి నుండి పదవీ విరమణ చేయనున్నారు. హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం కింద పెట్టుబడిదారులకు హెచ్‌డిఎఫ్‌సికి చెందిన 25 షేర్లకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 42 షేర్లు ఇస్తారు.

ఈ విలీనం తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరిస్తుంది. ప్రస్తుతం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.9.27 లక్షల కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ క్యాప్ రూ.5.11 లక్షల కోట్లు ఉంది. రెండు కంపెనీల మార్కెట్ క్యాప్ కలిపితే మొత్తం రూ.14.38 లక్షల కోట్లు అవుతుంది. టిసిఎస్ ప్రస్తుతం రూ.11.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో రెండో అతిపెద్ద కంపెనీగా ఉంది. అదే సమయంలో రిలయన్స్ రూ.16.88 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో దేశంలోనే అతిపెద్ద కంపెనీగా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి అనేది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఇది ఇల్లు, దుకాణం, ఇతర ఆస్తుల కొనుగోలు కోసం రుణాలను అందిస్తుంది. అదే సమయంలో బ్యాంక్‌లో అన్ని రకాల రుణాలు, ఖాతా తెరవడం లేదా ఎఫ్‌డి మొదలైనవి జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News