Monday, December 23, 2024

నేటి నుంచి కొత్త న్యాయచట్టాల అమలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో జులై 1 నుంచి మూడు కొత్త న్యాయచట్టాలు అమలు లోకి వస్తున్నాయి. దాదాపు 150 ఏళ్లుగా అమలులో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పిసి), స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్ ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ ) స్థానంలో భారతీయ సాక్ష అధినియం (బీఎస్‌ఏ ) రాబోతున్న విషయం తెలిసిందే.

అయితే వీటిపై ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా, మరోవైపు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే అనేక దశలుగా పోలీస్‌లకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు. కంప్యూటర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు, న్యాయవిచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

కొత్త చట్టాల ప్రకారం….
1. బాధితుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయవచ్చు. దీంతో వేగవంతంగా చర్యలు తీసుకొనే వెసులుబాటు పోలీస్‌లకు లభిస్తుంది.
2. జీరో ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్‌స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయొచ్చు.
ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. 14 రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసును కొలిక్కి తేవాలి.
3. అరెస్ట్ సందర్భాలలో బాధితుడు సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందడానికి వీలవుతుంది.
4. అరెస్ట్‌ల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్ట్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బాధితుల కుటుంబీకులు, స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది.
5. హేయమైన నేరాల్లో ఇకనుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి. ఏడేళ్లకు పైగా శిక్షపడే అవకాశం ఉన్న నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
6. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యమిచ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి కావాలి. అంతేకాదు బాధిత మహిళలు , చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స , వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి.
7. ఇక సమన్లు ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పంపించవచ్చు.

8. మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాలి.

9. బాధితులతోపాటు నిందితులు కూడా ఎఫ్‌ఐఆర్ నకళ్లను ఉచితంగా పొందే వీలుంటుంది. వీటితోపాటు పోలీస్ రిపోర్టు, ఛార్జిషీటు, స్టేట్‌మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పొందవచ్చు.

10. కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయం అందేలా చేయడానికి, న్యాయస్థానాలు కూడా గరిష్ఠంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి.

11.సాక్షుల భద్రతను వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని, సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి.

12. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో , వీడియో ద్వారా పోలీస్‌లు నమోదు చేయాలి.

13. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతోపాటు 15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు తాము నివాసం ఉన్న చోటే పోలీస్‌ల సాయం పొందవచ్చు. 14. స్వల్ప నేరాలకు సంబంధించి నేరస్థులకు సమాజ సేవ చేసే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి.

15. ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు, నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న స్థిర, చరాస్తులనూ జప్తు చేసే అధికారం పోలీస్‌లకు ఉంటుంది.

16. సాక్షుల వాంగ్మూలాలు, ఆడియో, వీడియో సాక్షాలన్నింటినీ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డిజి లాకర్‌లో భద్ర పరుస్తారు.

క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం (సీసీటీఎన్‌ఎస్) ద్వారా ఇప్పటికే దేశ వ్యాప్తంగా అన్నిపోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేసినందున , సాక్షాలను ఆన్‌లైన్ ద్వారా పంపుతారు. డిజి లాకర్‌ను ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్) కు అనుసంధానం చేస్తారు. పోలీస్‌లు, న్యాయవాదులు, న్యాయమూర్తులు అవసరమైనప్పుడు సాక్షాలను పరిశీలించుకోవచ్చు. దీని వల్ల ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు.

సందిగ్ధ అంశాలు
ఈ చట్టాల అమలులో కొన్ని సరళమయ్యే అంశాలు ఉన్నప్పటికీ సందిగ్ధం అయ్యే అంశాలు కొన్ని ఉన్నాయి. ఏవైనా నేరాలు కొత్త చట్టం అమలు లోకి రావడానికి ముందు , అంటే 2024 జూన్ 30 కి ముందు మొదలై, అమలు లోకి వచ్చిన తరువాత అంటే 2024 జులై 1 తరువాత కూడా కొనసాగుతుంటే బహుళ నేరాలకు పాల్పడిన వ్యక్తులపై చివరి కేసు నమోదైన తేదీనే పరిగణన లోకి తీసుకోవాలి. 2024 జూన్ 30 లోపు నేరం జరిగి, జులై 1 తర్వాత అది బయటపడితే , నేరం జరిగిన సమయమే ప్రామాణికం. అంటే పాతచట్టం ప్రకారమే కేసు నమోదు చేయాలి.

దర్యాప్తు అధికారులు, న్యాయవాదులు, న్యాయస్థానాలను గందరగోళానికి గురిచేసే విషయమిది. పాత చట్టాల కింద నమోదైన కొన్ని కేసులు నెలల తరబడి దర్యాప్తు, కొన్నేళ్ల పాటు విచారణ జరిగే అవకాశం ఉంది. దీంతో దర్యాప్తు అధికారులు పాత, కొత్త చట్టాలపై సమగ్ర అవగాహనతో ఉండాలి. రెండు రకాల కేసులు కలిపి దర్యాప్తు, న్యాయ విచారణ జరిపేటప్పుడు, సంక్లిష్టత ఎదురయ్యే అవకాశం ఉంది.

పోలీస్ కంప్యూటర్ వ్యవస్థలో జులై 1 నుంచి కొత్త చట్టాలకు అనుగుణంగా మార్పులు చేసినందున , పాత కేసుల దర్యాప్తులో సమస్యలు తప్పక పోవచ్చని సిబ్బంది చెబుతున్నారు. చాలా రాష్ట్రాలో సీసీటీఎస్‌ఎస, ఐసీజెఎస్ పూర్తి కాలేదు. ఇటువంటి చోట పరిస్థితి ఏమిటన్నది స్పష్టత లేదు. దర్యాప్తు అధికారులు తమకు కావలసినప్పుడు పాత పత్రాలు, సాక్షాల వంటివి డిజి లాకర్ ద్వారా ఎలా చూసుకోవాలన్న అంశం లోనూ స్పష్టత లేదు. చిన్నచిన్న నేరాలకు సామాజిక సేవలు చేయించడం వంటి శిక్షలు విధించవచ్చు. కానీ ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్షలు విధించాలన్న దానిపై స్పష్టత లేదు.

చట్టాల అమలు వాయిదా వేయాలని పీయుసిఎల్ లేఖ
అయితే వీటివల్ల కొన్ని విషయాల్లో పోలీస్‌ల అధికారాలు మరింత పెరుగుతాయని, సామాన్యులకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ కొత్త చట్టాల అమలును వాయిదా వేయాలని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పియుసిఎల్ ) కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్‌కు శనివారం లేఖ రాసింది. కొత్త చట్టాల తీరుతెన్నులు, ఈ చట్టాల అవసరం, ప్రవేశ పెట్టేందుకు అవకాశాలు తదితర అంశాలపై ముందు జాతీయ స్థాయిలో విస్తృతంగా చర్చ జరగాలని లేఖలో సూచించింది.

కేంద్రం మాత్రం ఈ చట్టాలపై ఎంతో విస్తృతంగా చర్చించామని, సభలో చర్చల సందర్భంగా అనేక మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారని న్యాయశాఖ మంత్రి ఇటీవల వెల్లడించిన విషయాన్ని పీయుసిఎల్ తన లేఖలో ప్రస్తావించింది. విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడమంటే ఆ చట్టాలపై వివరణాత్మక చర్చ జరగలేదన్న విషయాన్ని ఎత్తి చూపుతోందని పీయూసిఎల్ లేఖలో పేర్కొంది. క్రిమినల్ న్యాయవాదులు, న్యాయవ్యవస్థలు, న్యాయాధికారులు, సాధారణ పౌరుల నుంచి అభిప్రాయాలను స్వీకరించలేదన్న విషయం అర్థమవుతోందని ఉదహరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News