Friday, January 3, 2025

హెచ్‌పి, కర్నాటకల్లో రాహుల్ హామీల అమలు పూజ్యం

- Advertisement -
- Advertisement -

నెరవేర్చలేని వాగ్దానాన్ని బిజెపి చేయదు
గురుగ్రామ్ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా
కాంగ్రెస్‌పై విమర్శల కొనసాగింపు

చండీగఢ్ : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హర్యానాలో కాంగ్రెస్‌పై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తన విమర్శలు కొనసాగించారు. వృద్ధ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల గ్యారంటీల అమలు పూజ్యం అని అమిత్ షా ఆరోపించారు. గురుగ్రామ్ జిల్లా బాద్షాపూర్‌లో ఒక ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగిస్తూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బడా వాగ్దానాలు చేస్తుంటుందని, కానీ వారు హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలలో తమ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయలేకపోయారని విమర్శించారు. ‘రాహుల్ గాంధీ గ్యారంటీలు నిరర్థకం అయ్యాయి’ అని ఆయన ఆరోపించారు.

మరొక వైపు బిజెపి తాను నెరవేర్చలేని ఎటువంటి వాగ్దానాన్నీ చేయదని కేంద్ర హోమ్ శాఖ మంత్రి చెప్పారు. ‘రాహుల్ బాబా బృందం అభివృద్ధిని చేపట్టజాలదు’ అని, హర్యానా అభివృద్ధిని సాధ్యం చేసేది డబుల్ ఇంజన్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. ‘మేము దేశ సరిహద్దును కాపాడతాం, రిజర్వేషన్లను పరిరక్షిస్తాం, 370 అధికరణం పునరుద్ధరణను ఎన్నటికీ అనుమతించబోం’ అని ఆయన ఉద్ఘాటించారు. వక్ఫ్ బిల్లు గురించి ర్యాలీలో అమిత్ షా ప్రస్తావిస్తూ, ‘వక్ఫ్ బోర్డుపై ప్రస్తుత చట్టంతో ఒక సమస్య ఉంది& పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దానిని సవరిస్తాం’ అని చెప్పారు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ వక్ఫ్ సవరణ బిల్లు లక్షం సమాజంలో చీలిక సృష్టించడమేనని పలువురు ప్రతిపక్ష నేతలు క్రితం నెల ఆరోపించారు. తాము దానిని గట్టిగా వ్యతిరేకిస్తామని వారు స్పష్టం చేశారు.

బాద్షాపూర్ నుంచి రావ్ నర్బీర్ సింగ్‌తో సహా గురుగ్రామ్ ప్రాంతంలో పార్టీ అభ్యర్థుల తరఫున అమిత్ షా ప్రచారం సాగిస్తూ, సైన్యంలో ప్రతి పదవ జవాను హర్యానా నుంచి వచ్చినవారేనని తెలిపారు. ఇందిరా గాంధీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ డిమాండ్‌ను నెరవేర్చలేదని అమిత్ షా ఆరోపిస్తూ, వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను 2015లో ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని తెలిపారు. అగ్నిపథ్ పథకంపై రాహుల్ గాంధీని అమిత్ షా విమర్శిస్తూ, రాహుల్ గాంధీ ఒక ‘అసత్య యంత్రం’ అని పేర్కొన్నారు. అగ్నివీర్‌లకు ఉద్యోగాలు లభించబోవని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు అన్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. సాయుధ బలగాల్లో యువజనుల సంఖ్య గణనీయంగా పెంచేందుకే అగ్నివీర్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు అమిత్ షా తెలియజేశారు. ఆ అంశంపై బిజెపిని కాంగ్రెస్ అదేపనిగా దుయ్యబట్టుతుండడంతో, ‘మీ పిల్లలను సైన్యంలోకి పంపేందుకు వెనుకాడకండి. ప్రతి ఒక్క అగ్నివీర్‌కు హర్యానా, కేంద్రం పింఛన్ లభించే ఉద్యోగాలు ఇస్తాయి’ అని అమిత్ షా సభికులతో చెప్పారు. ‘ఐదు సంవత్సరాల తరువాత పింఛన్ లభించే ఉద్యోగం లేని ఒక్క అగ్నివీర్‌ను కూడా మీరు చూడబోరు’ అని అమిత్ షా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News