కొత్త విధానాలు, వ్యూహాలతో పథకాల అమలు
అధికారులకు ఎమ్‌ఎఫ్‌సి చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ ఆదేశం
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎమ్‌ఎఫ్‌సి) ద్వారా అమలు చేస్తోందని చైర్మన్ మొహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ తెలిపారు. ఈ పథకాలను మరింత మెరుగ్గా అమలు చేయడం కోసం సరికొత్త విధానాలు, వ్యూహాలు రూపొందించాలని ఆయన జిల్లా మైనారిటీ సంక్షేమాధికారులను ఆదేశించారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మంగళవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల మైనారిటీ సంక్షేమాధికారుల సమావేశాన్ని హజ్ హౌస్‌లో నిర్వహించింది. కార్పొరేషన్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎహెచ్‌ఎన్ కాంతి వెస్లీ పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు, బ్యాంక్ లింక్డ్ సబ్సిడీ పథకం, ఉర్దూ కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు, లైబ్రరీలపై చర్చించారు. మైనారిటీల అభ్యున్నతి కోసం ప్రభుతం అనేక కార్యక్రమాలను తీసుకోవడం పట్ల చైర్మన్ ఇంతియాజ్ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా అర్హు లైన మైనారిటీలు పెద్ద సంఖ్యలో లబ్దిపొందేలా చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.