Wednesday, January 22, 2025

ఆరు గ్యారంటీల అమలు నిరంతరం

- Advertisement -
- Advertisement -

అర్హులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు

మనతెలంగాణ/హైదరాబాద్:  బాధ్యత లేకుండా బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు ప్రజ ల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, రాజకీ య కాంక్షతోనే ఎన్నికల్లో లబ్ది పొందాలన్న దురాశ తప్ప బిజెపి, బిఆర్‌ఎస్‌కు వేరే ఆలోచనలేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బరువు, బాధ్యతతోనే ప్రజలకు సేవచేస్తున్నామని ఆయన తెలిపారు. శక్తినంతా కూడదీసుకొని ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని, మమ్మల్ని ప్రశ్నించే హక్కు బిజెపి, బిఆర్‌ఎస్ లేదని సిఎం రేవంత్ అన్నారు. గ్యారంటీల అమలు నిరంతర ప్రక్రియ అని, అర్హులు ఎప్పుడైనా మండల కార్యాలయాల్లో పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆరు గ్యారంటీలపై అపోహలు వద్దని సిఎంరేవంత్ రెడ్డి సూచించారు. సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే వర్తించాలని రేషన్‌కార్డు నిబంధన పెడుతున్నామని సిఎం రేవంత్ తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు నిరంతరం కొనసాగుతుందని, కొత్త రేషన్‌కార్డులను జారీ చేసి నిరంతరం కొత్త లబ్ధిదారులను చేరుస్తామన్నారు. ఏ కొలమానం లేకుండా ఇస్తే కోటీశ్వరులు కూడా దరఖాస్తు చేసుకుంటారని సిఎం రేవంత్ తెలిపారు.
గత ప్రభుత్వంలో వందేళ్ల విధ్వంసం
సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం (ఎంఓయూ) కార్యక్రమం సోమవారం సాయంత్రం సచివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీని మరోసారి ఎందుకు గెలిపించాలో కిషన్ రెడ్డి చెప్పాలని సిఎం రేవంత్ అన్నారు. మద్దతు ధర అడిగిన రైతులను చంపినందుకు మళ్లీ గెలిపించాలా? అని ఆయన ప్రశ్నించారు. వరదలు వచ్చి హైదరాబాద్ నష్టపోతే కిషన్‌రెడ్డి ఏమైనా కేంద్ర నిధులు తెచ్చారా? అని ఆయన నిలదీశారు. పదేళ్లలో కెసిఆర్, మోడీ కలిసి తెలంగాణకు చేసిందేమీ లేదని సిఎం రేవంత్ దుయ్యబట్టారు. పదేళ్లలో కెసిఆర్ వందేళ్లలో చక్కదిద్దలేనంత విధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. 75 రోజులుగా రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దటం గురించే ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. మూడోసారి మోడీని ప్రధాని చేస్తే ఏం చేస్తారు? రైతులను కాల్చి చంపుతారా? కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారు? హైదరాబాద్ లో వరదలు వచ్చినపుడు నిధులు తెచ్చారా? మీకు కెసిఆర్‌కు తేడా ఏం లేదని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకొని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు? నేడు సాయంత్రం 5గంటలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్ పథకాలను ప్రారంభిస్తున్నామని, మిమ్మల్ని ఆహ్వానించినా ఎందుకు రావడంలేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు.
ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్
ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ నిర్మించాలని యోచిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్ చెప్పారు. రాష్ట్ర బాగు కోసం ఎవరు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. నిస్సహాయులు ఎవరనేది నిర్ణయించడానికి ఏదైనా కొలమానం అవసరం అని ఆయన పేర్కొన్నారు. ఏ కొలమానం లేకుండా పథకం వర్తింపచేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైవేలకు కూడా రైతుబంధు నిధులు వెళ్లాయని ఆయన ఆరోపించారు. కొన్నేళ్లుగా వానలు బాగా పడటం వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్రంలో బోర్ల సంఖ్య పెరగటం వల్లే వరి ఉత్పత్తి పెరిగిందన్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవటం వల్ల ఇప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోయాయని, ఇప్పుడు భూగర్భ జలాలను కెసిఆర్ పెంచుతారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని, తెలంగాణ ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికులు నిర్లక్ష్యానికి గురయ్యాయని సిఎం రేవంత్ తెలిపారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయడాన్ని బిఆర్‌ఎస్ అడ్డుకోకపోగా ప్రోత్సహించిందని సిఎం ఆరోపించారు. గత పాలకులు సృష్టించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకెళుతున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏడాదికి ప్రభుత్వం రూ.6వేల కోట్లు అప్పులు చెల్లించాల్సి వచ్చేదని, పదేళ్లలో ఏడాదికి రూ.70వేల కోట్లు వడ్డీలకు కట్టాల్సిన పరిస్థితికి గత ప్రభుత్వం తెచ్చిందని సిఎం రేవంత్ ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కెసిఆర్ చేతిలో పెడితే రూ.70వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితికి దివాళా తీయించారన్నారు. ఇంత ఆర్ధిక సంక్షోభంలో ఉన్నా ప్రతి నెలా మొదటి తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు. మార్చి 31లోగా రైతు బంధు ఇస్తామని చెబుతున్నా, నిస్సిగ్గుగ్గా బిఆర్‌ఎస్ పార్టీ మమ్మల్ని విమర్శిస్తోందన్నారు.
60 రోజుల్లో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
ఆర్ధిక నియంత్రణ పాటిస్తూ అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా తమ ప్రభుత్వం బడ్జెట్‌ను ఖర్చు చేస్తోందని, మమ్మల్ని అభినందించాల్సింది పోయి కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావులు అబద్దాలు చెబుతున్నారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఇది ఆ నలుగురి ఘోష తప్ప వాళ్ల పార్టీ వాళ్లు కూడా ఆమోదించడం లేదన్నారు. మేం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చే దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. ఉద్యోగ నియామకాల్లో చిక్కు ముడులు విప్పుతూ 60 రోజుల్లో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సిఎం రేవంత్ తెలిపారు. నిర్లక్ష్య ధోరణితో బిఆర్‌ఎస్ గాలికి వదిలేస్తే మేం నియామకాయాలు చేపట్టామని, మార్చి 2న మరో 6వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని సిఎం రేవంత్ తెలిపారు. మీరు ఎక్కడికక్కడ వదిలేసిన సంసారాన్ని తాము చక్కదిద్దుతున్నామని సిఎం రేవంత్ తెలిపారు. నిరుద్యోగులను బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం వివాదాల పేరుతో వేలాది ఉద్యోగాల భర్తీ నిలిపివేస్తే తాము కోర్టు కేసులను పరిశీలించి నియామక పత్రాలు ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సింగరేణిలో దశాబ్ద కాలంగా కారుణ్య నియామకాలు జరగలేదన్నారు.
హరీష్ మెదడు ఉండి మాట్లాడుతున్నారా?
80 వేల పుస్తకాలు చదివిన మేధావి కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని సిఎం రేవంత్ ఆరోపించారు. మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది అంటుంటే, మేడిగడ్డలో నీళ్లు అన్నారంలో పోయాలని హరీష్ అంటున్నారని, హరీష్ మెదడు ఉండి మాట్లాడుతున్నారా? ఎలా కుంగిపోయిందో సమాధానం చెప్పరు, చూసొద్దామంటే రారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ పాలనలో నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఎపి ప్రభుత్వం వందల టిఎంసీలు తరలించుకుపోతుంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎపి సిఎం జగన్‌కు విందు ఇచ్చి ఒప్పందాలు చేసుకొని కృష్ణా జలాలు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. కృష్ణా జలాలపై బిఆర్‌ఎస్ వాళ్లు మళ్లీ అవే అబద్దాలు చెబుతున్నారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. 2014, 2018, 2023 ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి చర్చిద్దామని బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలకు ఆయన సవాల్ విసిరారు. దీనికి బిఆర్‌ఎస్, బిజెపిలు సిద్ధమా? అని రేవంత్ ప్రశ్నించారు. బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కాంగ్రెస్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News