Monday, December 23, 2024

బాలికల చదువుకు బహిష్టు చిక్కులు

- Advertisement -
- Advertisement -

రుతు ఆరోగ్యం అంటే నెలసరి బహిష్టు అన్నది అందమైన ప్రకృతి ప్రక్రియ. ప్రతి మహిళకు ఇది తప్పదు. కానీ ప్రపంచం దీన్నింకా ఏదో కళంకంలా భావిస్తుండడం అత్యంత శోచనీయం. ఈ సహజ ప్రాకృతిక పరిస్థితి మహిళలకు ముఖ్యంగా బాలికలకు ఈ రుతు సమయాలను అంటే నెలసరి పరిస్థితిని ఎదుర్కోవడం, వాటిని నిర్వహించడం ఒక సవాలుగా ఉంటోంది. ఈ సమయాల్లో బాలికలు తమ పాఠశాలలకు వెళ్లలేక ఆబ్సెంట్ అవుతుంటారు. స్కూళ్లలో బహిష్టుకు సంబంధించిన శానిటేషన్ సౌకర్యాలు, పరికరాలు లోపించడమే దీనికి కారణం. ఈ విధంగా బాలికలు పాఠశాలలకు గైర్హాజరు కావడంతో చదువుల్లో కాస్త వెనుకబడే పరిస్థితి కూడా ఎదురౌతోంది. ఈ విధంగా అంతరాయం లేని విద్యను పొందే హక్కును బాలికలు పొందలేక పోతున్నారు.

ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. బాలికల ఆరోగ్యానికి వారి చదువులకు సంబంధం ఉందని యునెస్కో గుర్తించింది. బాలికలు పాఠశాలలకు హాజరు కాలేకపోతే తోటి విద్యార్థుల కన్నా వెనుకబడిపోవడం జరుగుతుంది. ఈ లోటును భర్తీ చేసుకోడానికి మానసిక సంఘర్షణ పడుతుంటారు. మానసిక సమస్యగా మారి ఇది రానురాను తక్కువ స్వీయ గౌరవానికి దారి తీస్తుంది కూడా. అకడమిక్ కెరీర్‌పై విశ్వాసం తగ్గిపోతుంది. ఈ రుతు ఆరోగ్యం వల్ల ఎదురయ్యే ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ కారణంగా బాలికలు పాఠశాలలకు గైర్హాజరును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు భారత ప్రభుత్వం రుతు ఆరోగ్య పథకాన్ని 2011లో ప్రారంభించింది. బహిష్టు సమయంలో బాలికలకు తగిన శుభ్రతకు కావలసిన సౌకర్యాలు, పరికరాలు ఇతర అవసరాలు పాఠశాలల్లో సమకూర్చడానికి ఏర్పాట్లు చేసింది.

బహిష్టు సమయంలో బాలికలు పాఠశాలకు దూరం కాకుండా ఉండాలనే సంకల్పంతో 2014లో రాష్ట్రీయ కిశోర్ స్వస్త కార్యక్రమం (ఆర్‌కెఎస్‌కె) అమలు లోకి తెచ్చింది. శానిటరీ ప్యాడ్స్, వంటివి వారికి అందుబాటులో ఉండేలా చూసింది. ఇదే లక్షంతో వివిధ రాష్ట్రాలు తమదైన రీతిలో పథకాలు అమలు చేయడం ప్రారంభించాయి. అయినా ఈసమస్యలు పరిష్కారానికి మరింత చేయవలసి ఉందని ప్రభుత్వ పాఠశాలల ప్రతినిధులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు పాఠశాల బోధనలో రుతు ఆరోగ్యం పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టి అవగాహన కల్పించాలని , ఈమేరకు రుతు ఆరోగ్య సమస్యలను సమర్ధంగా నిర్వహించేలా, ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించాలని సూచిస్తున్నారు.

దీనికి అదనంగా పాఠశాలల్లో ఆరోగ్య పరికరాలు, ఉత్పత్తులు , సౌకర్యాలు అందుబాటులో తప్పనిసరిగా ఉంచాలని చెబుతున్నారు. బహిష్టు ఒక కళంకంగా భావించి భయపడే పరిస్థితిని తొలగించాలన్నారు. విద్యావంతులైన బాలికలు తమ పిరియడ్స్ ఎప్పుడో ఆ సమాచారం పాఠశాలకు తెలియచేసి వాటిని ఎలా నిర్వహించుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. లింగసమానత సాధించేలా ఈ అంశంపై బాలురను కూడా చర్చలో పాల్గొనే అవకాశం కల్పించాలి. రుతుఆరోగ్యం అనుభవించడం, వాటిని నిర్వహించడం ఒక ప్రాథమిక హక్కుగా గుర్తింపు పొందాలి. ఈ హక్కును కాపాడవలసిన బాధ్యత పాఠశాలల పైన . .. ప్రభుత్వంపై కూడా ఉంది.

గ్రామీణ గ్యాంబియాలో సర్వే
చదువుకుంటున్న బాలికల బహిష్టు వారి చదువులపై ఎంతటి ప్రభావం చూపిస్తుందో గ్రామీణ గ్యాంబియాలో 2015 నుంచి 2017 వరకు సర్వే నిర్వహించారు. ప్రాథమిక , సెకండరీ పాఠశాలలో కౌమార బాలికలు తమ బహిష్టు కాలాన్ని ఏ విధంగా నిర్వహించగలుగుతున్నారో మొత్తం 19 పాఠశాలల నుంచి సమాచారం సేకరించారు. బాలురు, బాలికల ఉమ్మడి విద్యావిధానంలో చర్చలు నిర్వహించారు. వారిని విడివిడిగా ఇంటర్వూలు చేశారు. స్కూళ్లలో పరిశుభ్రత, నీటి సౌకర్యం, ఆరోగ్య పరిస్థితులను సమీక్షించారు. సామాజిక కట్టుబాట్లు, తోటి విద్యార్థుల్లో బహిష్టుపై ఉన్న భయాలు, స్కూళ్లలో తగిన సౌకర్యాలు లేకపోవడం వల్లనే బహిష్టు సమయంలో బాలికలు స్కూలుకు గైరు హాజరువుతున్నారని సర్వేలో తేలింది. బహిష్టు సమయంలో బాలికలు స్కూలుకు వెళ్లక పోవడానికి ప్రధాన కారణం ఆ సమయంలో వారికి భరించలేని నొప్పి రావడం.

అయినా సరే డ్రాపవుట్‌ల పై దీని ప్రభావం గ్యాంబియాలో అంతగా లేదని 561 మంది బాలికలపై నిర్వహించిన సర్వేలో బయటపడింది. వీరిలో 27 శాతం మంది బహిష్టు సమయంలో నెలకు ఒకే రోజు మాత్రమే ఆబ్సెంట్ అవుతున్నామని చెప్పారు. అదీ కూడా విపరీతమైన నొప్పి రావడం వల్లనే ఆ ఒక్కరోజు వెళ్లలేక పోతున్నామని చెప్పారు. 16.8 శాతం మంది బహిష్టు సమయంలో మూత్రమార్గం ఇన్‌ఫెక్షన్ అవుతోందని అందుకే ఆ ఒక్కరోజు వెళ్ల లేకపోతున్నామని తెలిపారు. టాయిలెట్లు పరిశుభ్రంగా లేనందున వెళ్లలేక పోతున్నట్టు , 1.71 శాతం మంది జననేంద్రియం ఇన్‌ఫెక్షన్ వల్ల వెళ్లలేక పోతున్నట్టు చెప్పారు. పాఠశాలల్లో పరిశుభ్రమైన టాయిలెట్లను వినియోగిస్తున్నట్టు 0.44 శాతం మంది పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News