సిటీబ్యూరో: తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. గుడ్ గవర్నెస్స్ డే ని పురస్కరించుకుని డోగ్రా సైనికులు, సైబరాబాద్ పోలీసులు శిల్పారామంలో శనివారం పైప్ బ్యాండ్ షో నిర్వహించారు. సైబరాబాద్ పోలీసులు, 13వ డోగ్రా రెజిమెంట్ సికింద్రాబాద్ సైనికులు పైప్ బ్యాండ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు సాధించిన విజయాలను గర్వంగా చెప్పుకునే విధంగా బ్యాండ్ షో ఏర్పాటు చేశారని అన్నారు. తొమ్మిదేళ్లలో శాంతిభద్రతల విషయంలో ప్రగతి సాధించామని చెప్పారు.
కిందిస్థాయి నుంచి అధికారుల వరకు పోలీసులు క్రమశిక్షణతో పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చాలా సంస్కరణలు తీసుకుని వచ్చారని తెలిపారు. ప్రజల భద్రత కోసం నూతన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉండడం వల్లే పెద్దపెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. డిసిపి శిల్పవల్లి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగానే పైప్ బ్యాండ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రదర్శనలో పాల్గొన వారికి మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, అడ్మిన్ డిసిపి యోగేష్ గౌతం మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఎసిపి నరసింహారావు, ఇన్స్‌స్పెక్టర్ తిరుపతి రావు, కొల్లూరు ఇన్స్‌స్పెక్టర్ సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.