Monday, December 23, 2024

ప్రయాణికులను ఆకట్టుకుంటున్న సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ కొత్త లోగో

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ కొత్త లోగో ప్రయాణికులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. తొలి ఫేజ్ మెట్రో రైలు లోగోకు కాస్త భిన్నంగా ఈ లోగో ఉంది. మెట్రో ట్రైన్‌తో పాటు దానిపైనుంచి విమానం వెళుతున్నట్లు మూడు రంగులతో ఈ లోగోను తీర్చిద్దిద్దారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ పేరును లోగోలో పొందుపర్చారు. మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్‌రెడ్డి ఈ లోగోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో పాటు ఈనెల 09వ తేదీన సిఎం కెసిఆర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి ఫేజ్ మెట్రో రైల్ ప్రాజెక్టును హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్  నిర్మించగా సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ ప్రాజెక్టును హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థలతో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ నిర్మిస్తుండడంతో లోగోలో హెచ్‌ఏఎంఎల్ పేరును పొందుపర్చారు.

ఈ నెల 6వ తేదీన దరఖాస్తుదారులతో సమావేశం

ఇప్పటికే సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ టెండర్లను ఆహ్వానిస్తోంది. ఈ నెల 13వ తేదీ వరకు బిడ్ దాఖలు చేసుకోవడానికి అవకాశమిచ్చారు. ఈ నెల 6న టెండర్లు దాఖలు చేసిన దరఖాస్తుదారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. సెకండ్ ఫేజ్ మెట్రో కోసం రూ.6,250 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు బడ్జెట్‌లో నిధులు మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాకపోవడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్టు నిర్మించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News