Wednesday, December 25, 2024

మూడు దశాబ్దాల ముందుచూపు

- Advertisement -
- Advertisement -

Improved water supply system in Hyderabad:KTR

భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చేలా హైదరాబాద్ నీటి సరఫరా వ్యవస్థ

ఓఆర్‌ఆర్ ఫేజ్-2లో
సమృద్ధిగా తాగునీరు
మంచినీటి సరఫరా వ్యవస్థ
కోసం కోట్లు
ఖర్చు చేస్తున్నాం
కొండపోచమ్మ, మల్లన్న
సాగర్ ద్వారా నీటి
తరలింపుతో నగరానికి
ఎన్నటికీ సమస్య రావద్దన్నదే
కెసిఆర్ ఆలోచన : కెటిఆర్

మన తెలంగాణ/సిటీబ్యూరో: ప్రస్తుత అవసరాలు తీర్చడంతో పాటు 30ఏళ్ల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని 2051 వరకు ఉండే అవసరాలను తీర్చేలా పనులు జరుపుతున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో నగర శివారు గ్రామాలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల ప్రజలకు తాగునీటిని అందించేందుకు చేపడుతున్న ఓఆర్‌ఆర్ ఫేజ్ 2లోని ప్యా కేజీ2 ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ దేశంలోనే వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ ముందుందని, మన నగరానికి ఉన్న భౌగోళిక, వాతావరణ అనుకూల పరిస్థితుల కారణంగా వేగంగా విస్తరించడంతో పాటు జనాభా పెరుగుతోందన్నారు. నగర ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. మొదటిదశలో జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 2వేల కోట్లతో మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ అంటే మొత్తం ఓఆర్‌ఆర్ పరిధిగా తాము భావిస్తున్నామని, అందుకే ఈ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

ఓఆర్‌ఆర్ పరిధిలో మొదటి విడతలో రూ.775 కోట్లతో తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పడు ఫేజ్2లో భాగంగా ఏకంగా 1200 కోట్ల నిధులతో ఓఆర్‌ఆర్ పరిధి మొత్తానికి తాగునీటిని అందించే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రస్తుతం నగరంతో సహా ఓఆర్‌ఆర్ వరకు దాదాపు 600 ఎంజిడీ నీటిని సరఫరా చేస్తున్నామని, 2051 నాటికి 1000 ఎంజిడీలు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దీనికి తగ్గట్లుగా నీటిని అందించే ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు. కృష్ణానది నుంచి సుంకిశాల వద్ద నీటిని తీసుకొని నగరానికి సరఫరా చేసేందుకు రూ. 1400 కోట్లతో కొత్త లైన్ నిర్మాణం జరుగుతుందన్నారు. నగర తాగునీటి కోసం రూ.6వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

తాను చదువుకునే రోజుల్లో ఎర్రమంజిల్లో నివాసం ఉండే వాళ్లమని, ఇంటి నుంచి అబిడ్స్‌లో ఉన్న స్కూల్, ఖైరతాబాద్ మీదుగా వెళ్లేటప్పుడు తరచూ జలమండలి కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ధర్నాలు జరిగేవని కెటిఆర్ గుర్తు చేశారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి పరిస్థ్దితులే లేకుండా నగర ప్రజలకు సమృద్ధ్దిగా తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోను తాగునీటి సమస్యలు రావొద్దని, చెన్నై లాంటి నీటి ఎద్దడి పరిస్థితులు మనకు ఉండొద్దనే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కూడా నగరానికి తాగునీటిని అందించనున్నట్లు చెప్పారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ నుంచి నగరానికి నీటిని సరఫరా చేయాలని, గండిపేటకు నీటిని తరలించడం ద్వారా ఎప్పటికి నగరంలో నీటి సమస్య తలెత్తకుండా చూడాలనేది కెసిఆర్ ఆలోచన అని చెప్పారు. దీర్ఘకాలికంగా ఆపరిష్కృతంగా ఉన్న అల్కాపూర్ నీటి సమస్య ఇప్పడు తీరుతుందని, ఏడాది లోపు పనులు పూర్తి అవుతాయన్నారు. అనంతర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రసంగిస్తూ భవిష్యత్తులో పెరగనున్న జనాభాకు తగ్గట్లుగా అభివృద్ది జరగాలనే ముందుచూపుతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచిస్తారని పేర్కొన్నారు.

గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతాలకు జీహెచ్‌ఎంసీ ప్రాంతం నుంచి కష్టపడి నీటిని తరలించాల్సి వచ్చేదని, ఇప్పుడు మాత్రం ఓఆర్‌ఆర్ పరిధిలోని ప్రాంతాలకు నీటిని అందించేందుకు మన ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్దను ఏర్పాటు చేసిందన్నారు. అదే విధంగా జలమండలి ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ నగర ప్రజలకు తాగునీటిని అందించేందుకు జలమండలికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. గతంతో ఒక ఏడాదిలో గరిష్టంగా సుమారు వెయ్యి కోట్ల రూపాయలు పనులు జరిగేవని, ఇప్పడు మాత్రం ఒక సంవత్సరంలో రూ. 8వేల కోట్ల పనులను జలమండలి చేస్తోందని పేర్కొన్నారు. మూడు నెలలో ఓఆర్‌ఆర్ ఫేజ్ 2 ద్వారా నీటి సరఫరా అందించే లక్షంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. మూడు షిప్ట్‌లో వేగంగా పనులు జరిపి ప్రజలకు నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, సురభి వాణిదేవి, రంగారెడ్డిజిల్లా పరిషత్ చైర్మన్ అనితా హరనాథ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, మణికొండ మున్సిఫల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, స్దానిక ప్రజా ప్రతినిధులు, జలమండలి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News