ఇస్లామాబాద్ : మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బాలీవుడ్ నటులు సల్మాన్‌ఖాన్, షారూక్ ఖాన్‌లను మించిపోయి నటించారని పాకిస్థాన్‌లోని పిడిఎం పార్టీ నేత మౌలానా ఫజ్లుర్ రెహ్మన్ చురకలకు దిగారు. ఇటీవల ఇమ్రాన్‌ఖాన్‌పై దాడి జరిగిందనడం ఓ పెద్ద కట్టుకథ. ఇందులో ఆయన గాయపడినట్లు ఎంతో బాగా నటించి ఈ సీన్‌ను బాగా రక్తికట్టించారని పాకిస్థాన్ డెమోక్రాటిక్ మూవ్‌మెంట్ అధ్యక్షులు అయిన రెహ్మన్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నటులు సల్మాన్, షారూక్‌లు కూడా ఇమ్రాన్ ముందు దిగదుడుపై అవుతారని వ్యాఖ్యానించారు. ఆహా క్యా బాత్ హై అంటూ నటనలో ఇమ్రాన్ ప్రతిభకు అంతా ఫిదా కావల్సిందే అన్నారు. గురువారం ఇమ్రాన్ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిగాయి. ఆయన కాలికి గాయాలు అయ్యాయి. తరువాత లాహోర్‌లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం నుంచి తిరిగి తన లాంగ్‌మార్చ్‌ను ఆరంభిస్తారు. ఈ నేపథ్యంలో దేశంలోని విపక్ష నేతల నుంచి ఇమ్రాన్‌ఖాన్ వ్యవహారంపై అనుమానాస్పద వ్యాఖ్యలు వెలువడుతున్నాయి.