దేశాన్ని అడుక్కునే స్థాయికి తెచ్చారు
ప్రధాని ఎన్నికను బహిష్కరించిన ఇమ్రాన్
జాతీయ అసెంబ్లీకి రాజీనామా ప్రకటన
పార్లమెంట్‌కు పిటిఐ టోటల్ బాయ్‌కాట్
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఇప్పుడు పచ్చి పగటి రాత్రి దొంగల వేదిక అయిందని, ఆ దొంగల పక్కన కూర్చోవడం కుదరదని, అందుకే ఎంపిగా రాజీనామా చేస్తున్నానని మాజీ ప్రధాని పిటిఐ నేత ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. తాను పార్టీ ఇతర నేతలంతా సామూహిక రాజీనామాలకు దిగాలని నిర్ణయించుకున్నామని, దేశ ప్రధాని ఎంపిక ప్రక్రియ ఇప్పుడు బూటకంగా మారినందున పిటిఐ దీనిని బహిష్కరిస్తుందని ఇమ్రాన్ సోమవారం భావోద్వేగంతో ప్రకటించారు. తాను దేశ స్వేచ్ఛాభిలాషిని అని అయితే కొందరు ధనదాహంతో , అధికార వ్యామోహంతో విదేశీ శక్తుల తొత్తులయ్యారని, ఈ క్రమంలో వారు ఈ దేశాన్ని మరింతగా బిచ్చమెత్తేలా చేస్తున్న ఈ ద్రోహులు దొంగల సరసన తాను ఇమడలేనని, ఎంపిగా తాము రాజీనామాలకు దిగుతున్నామని ఇక ప్రజల వద్దకు వెళ్లుతామని ఇమ్రాన్ సోమవారం ఘాటుపదజాలంతో ప్రకటన వెలువరించారు. తమది దేశ అసలుసిసలు స్వాతంత్ర పోరాటమని, ఇప్పుడే ఆరంభమయిందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.