పాక్ చట్టం ప్రకారం ఇది అక్రమమని మీడియాలో వెల్లడి
ఇస్లామాబాద్ : పదవీభ్రష్టుడైన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనకు విదేశీ ప్రముఖులు బహుమానంగా ఇచ్చిన అత్యంత విలువైన మూడు వాచీలను విక్రయించి రూ.3.6 కోట్లు గడించారని ఒక మీడియా కథనం బుధవారం వెల్లడించింది. జియో న్యూస్‌తో కలసి అధికారికంగా చేసిన దర్యాప్తులో ఈ వివరాలు వెలుగు లోకి వచ్చాయి. ఇమ్రాన్ తన పదవీకాలంలో ఆభరణాల కోవకు చెందిన ఈ మూడు వాచీలు రూ.154 మిలియన్ విలువ చేస్తాయని తేలింది. పాకిస్థాన్ చట్టం ప్రకారం విదేశీ ప్రముఖుల నుంచి ఏ బహుమానం వచ్చినా దాన్ని ప్రభుత్వ భద్రతలో తొషఖానాలో ఉంచాలి. ఈ నగల వాచీలు తొషఖానా నుంచి స్వంత సొమ్ముతో కొనుగోలు చేయడానికి బదులు ఇమ్రాన్ ఖాన్ వాటిని స్థానిక వాచ్ డీలరుకు విక్రయించి వచ్చిన సొమ్ములో 20 శాతం వంతున ప్రభుత్వ ట్రెజరీలో జమచేసినట్టు బయటపడింది. దీనికి రుజువుగా డాక్యుమెంట్లు, విక్రయ రశీదులను మీడియా చూపించింది. ఈ వివాదంపై ఇమ్రాన్‌ఖాన్ స్పందిస్తూ అవి తనకు వచ్చిన బహుమతులని, వాటిని తానుంచుకోవాలో వద్దో అన్నది తన ఇష్టమని పేర్కొన్నారు.