Saturday, November 16, 2024

ఇమ్రాన్ కు జైలు

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్‌లో ‘పడగనీడ ప్రజాస్వామ్యం’ నడుస్తున్న సంగతి ప్రపంచానికి తెలిసిందే. అక్కడ ప్రజలెన్నుకొన్న ఏ ప్రభుత్వమైనా సైన్యం సంతృప్తి మేరకే పని చేయవలసి వుంటుంది గాని, స్వతంత్రంగా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం బొత్తిగా వుండదు. మొన్న శనివారం నాడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు మూడేళ్ళ శిక్ష విధించడం వెనుక సైన్యం హస్తం వున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే నవంబర్‌లో జరగగలవని అనుకొంటున్న జాతీయ ఎన్నికల్లో ఇమ్రాన్ పోటీ చేయకుండా చూడడం కోసమే తోషాఖానా కేసులో కోర్టు ఈ శిక్ష విధించిందని బోధపడుతున్నది. ఇమ్రాన్‌ను రాజకీయంగా తిరిగి లేవలేనంతగా దెబ్బ తీయాలన్న కుట్ర ఇందులో వున్నట్టు భావిస్తున్నారు. ప్రభుత్వాధినేతలకు, అధికారులకు వచ్చే బహుమతులను భద్రపరిచే విభాగాన్ని తోషాఖానా అంటారు. ప్రధానిగా వున్నప్పుడు ఇమ్రాన్ తనకు వచ్చిన విలువైన బహుమతుల వివరాలను బయటపెట్టకుండా దాచి వుంచాడని, వాటిలో కొన్నింటిని తక్కువ ధరకు తాను కొని అమ్ముకొని బాగా డబ్బు చేసుకొన్నాడన్నది ఇమ్రాన్‌పై గల ప్రధానమైన ఆరోపణ. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పిఎంఎల్‌ఎన్) నాయకత్వంలోని పాలక పక్షాల కూటమి 2022 ఆగస్టులో ఇమ్రాన్‌పై ఈ కేసు దాఖలు చేసింది. సైన్యంతో బొత్తిగా పొసగక, పార్లమెంటులో మిత్ర పక్షాల మద్దతు కోల్పోయి ఇమ్రాన్ పదవీచ్యుతుడయ్యారు. అయితే ఆయనకు, ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ)కు ప్రజల్లో ఇప్పటికీ విశేష ఆదరణ వుంది. ఇమ్రాన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే తనకు పెద్ద సవాలు కాగలరని ప్రధాని షరీఫ్ భయపడుతున్నారు. ఆ విధంగా షరీఫ్‌కు, సైన్యానికి కూడా ఈ తీర్పు సంతోషదాయకమైన పరిణామం. తనను అరెస్టు చేసే ప్రమాదమున్నదని ముందుగానే ఊహించిన ఇమ్రాన్ ఖాన్ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక వీడియోను తయారు చేసి విడుదల చేశారు. “మీరు మౌనంగా వుండొద్దు, నేను మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను” అని వారికి అందులో ఆయన విజ్ఞప్తి చేశారు. ఇస్లామాబాద్ కోర్టులో కేసు విచారణను తాత్కాలికంగా నిలిపి వుంచాలని హైకోర్టు ముందు రోజే ఆదేశాలు ఇచ్చినప్పటికీ కింది కోర్టు దానిని పట్టించుకోలేదని కూడా వార్తలు వెలువడుతున్నాయి. అలా జరిగి వుంటే అది చాలా దిగ్భ్రాంతి కలిగించే పరిణామం. న్యాయ వ్యవస్థలో క్రమ శిక్షణ లేమి ఏ దేశానికైనా ప్రమాదమే. గత మే నెలలో ఒకసారి ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. ఆ సందర్భంలో పిటిఐ కార్యకర్తలు, ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఈసారి మాత్రం ఆ స్థాయిలో నిరసన వ్యక్తం కావడం లేదని చెబుతున్నారు. అయినా పిటిఐ పార్టీ వెనుకడుగు వేయకుండా ప్రభుత్వాన్ని ఎదుర్కోడానికే సిద్ధపడుతున్నది. 2022లో ఇమ్రాన్‌పై తోషాఖానా కేసు దాఖలు చేసిన తర్వాత రెండు మాసాలకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆయనను జాతీయ అసెంబ్లీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్నది. దానితో జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ స్థానం ఖాళీగా వున్నది. పాకిస్తాన్‌లో ప్రధానికి, సైన్యానికి విభేదాలు కొత్తవి కావు. దాని 75 ఏళ్ళ చరిత్రలో ఏ ఒక్క ప్రధాన మంత్రి పూర్తి ఐదేళ్ళు అధికారంలో కొనసాగలేదు. పాక్‌ను ఇంత వరకు 29 మంది ప్రధానమంత్రులు పరిపాలించారు. 18 సందర్భాల్లో ప్రధానులు అవినీతి ఆరోపణలు, సైనిక తిరుగుబాట్లు వంటి పరిణామాల నేపథ్యంలో పదవిని కోల్పోయారు. ఒక ప్రధాని (జుల్ఫికర్ అలీ భుట్టో) భుట్టో ని ఉరి తీశారు. 1993లో ఒక్క సంవత్సరంలోనే ఐదు సార్లు ప్రధానులు మారారు. పాకిస్తాన్ ఇప్పుడు అపూర్వమైన ఆర్థిక సంక్షోభ ఊబిలో దిగబడి వుంది. అత్యంత కష్టంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి రుణ సౌకర్యాన్ని పొందగలిగింది. దాని షరతులకు లోబడి అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవలసి వచ్చింది. పాక్ రుణ భారం 140 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకొన్నది. ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం వల్ల పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సమయంలో ప్రజల దృష్టిని మరల్చడం కోసం కూడా ఇమ్రాన్ ఖాన్ కేసును ముందుకు తీసుకొచ్చి ఆయనకు శిక్ష పడేలా చూసినట్టు భావించవచ్చు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత దేశంతో చర్చల కోసం ఆరు మాసాల వ్యవధిలో రెండు సార్లు విజ్ఞప్తి చేయడం గమనించవలసిన విషయం. ఎన్నికలు మొదలయ్యే లోగా ఇమ్రాన్‌కు ఊరట లభించి ఆయన పోటీ చేసే అవకాశాలు తెరుచుకొంటాయో లేదో చూడాలి. పాక్ సుప్రీంకోర్టు ఇమ్రాన్ పట్ల సానుభూతితో వ్యవహరించే అవకాశాలను బట్టి ఇది ఆధారపడి వుంటుంది. ప్రజాస్వామ్యం పేరిట ఎన్నికలు జరిపించినప్పటికీ సైనిక నియంతృత్వమే కొనసాగుతూ వుండడం పాక్ ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్య.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News