హెచ్‌బివొ జర్నలిస్టు ఇంటర్వూలో పాక్ ప్రధాని ఇమ్రాన్ స్పష్టీకరణ
ఇస్లామాబాద్ : కశ్మీర్ సమస్య పరిష్కారంలో అమెరికా సహాయాన్ని మళ్లీ పాక్ ప్రధాని ఇమ్రాన్ అభ్యర్థించారు. ట్రంప్ హయాంలో కూడా ఇమ్రాన్ కశ్మీర్ విషయాన్ని తెరపైకి తెచ్చి అమెరికా జోక్యాన్ని అర్థించడం, దాన్ని భారత్ తిప్పికొట్టడం జరిగింది. ఇప్పుడు మళ్లీ హెచ్‌బివొ జర్నలిస్టు జోనాధన్ స్వాన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో చైనా గురించి ప్రశ్నించగా, ఆ విషయం అప్రస్తుతం అంటూ కశ్మీర్ అంశాన్ని లేవ నెత్తారు. కశ్మీర్ సమస్య పరిష్కారమైతే భారత్, పాక్ దేశాలు రెండూ అణ్వాయుధాలను పెంచుకోవలసిన అవసరం ఉండదన్నారు. అమెరికా అధ్యక్షునిగా బైడెన్ జనవరిలో బాధ్యతలు చేపట్టిన తరువాత తాను ఈ విషయమై ఆయనతో మాట్లాడలేదని ఇమ్రాన్ పేర్కొన్నారు. అయితే తమిద్దరి మధ్య సమావేశం జరిగితే ఈ సమస్యను తీసుకు వస్తానని చెప్పారు.
సమావేశం జరిగితే ఏం చర్చిస్తారు ? అన్న ప్రశ్నకు ఉపఖండంలో దాదాపు 1.4 బిలియన్ మంది ప్రజలు ఉంటున్నందున ప్రపంచం లోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికాకు ఈ విషయంలో పెద్ద బాధ్యతే ఉందన్నారు. కశ్మీర్‌లో ఒక వివాదం ద్వారా తాము ఇంకా బందీగా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అభిప్రాయం ప్రకారం కశ్మీర్ వివాదాస్పదమైన భూభాగమని, కశ్మీర్ ప్రజలు తమ భవిష్యత్ నిర్ణయించుకోడానికి వీలుగా దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) అవసరమని ఇమ్రాన్ ఇంటర్వూలో పేర్కొన్నారు. కానీ అలా జరగడం లేదని, అమెరికా జోక్యం చేసుకుంటేనే ఇది పరిష్కారమౌతుందని ఆయన స్పష్టం చేశారు.