ఇస్లామాబాద్ : తోషాఖానా అవినీతి కేసులో మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్ ఇఇన్సాఫ్ పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను దోషిగా తేలుస్తూ ఇస్లామాబాద్ లోని జిల్లా, సెషన్స్ కోర్టు శనివారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక , ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. శిక్షతోపాటు లక్ష పాకిస్థాన్ రూపాయల జరిమానా విధించింది. ఈ జరిమానా కట్టక పోతే మరో ఆరు నెలల పాటు ఇమ్రాన్ జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది.
తీర్పు వచ్చిన క్షణాల్లోనే అరెస్టు ….
మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో క్షణాల వ్యవధి లోనే ఇమ్రాన్ ఖాన్‌ను పోలీస్‌లు అరెస్టు చేశారు. లాహోర్ లోని తన నివాసం నుంచి ఆయనను పోలీస్‌లు అదుపు లోకి తీసుకున్నారు. కోట్‌లక్‌పత్ జైలుకు ఆయనను తరలిస్తున్నట్టు పంజాబ్ పోలీస్‌లు వెల్లడించారు.
తోషాఖానా కేసు పూర్వాపరాలు
గత ఏడాది ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆయనను కేసులు చుట్టుముట్టాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా, విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను అక్రమ పద్ధతిలో అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది. ఇమ్రాన్ తన హయాలో దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. అయితే వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి తీసుకోవాలి.
కానీ ఇందులో రూ. 38 లక్షల రోలెక్స్ గడియారాన్ని కేవలం రూ. 7,54,000 చెల్లించి సొంతం చేసుకొన్నారు. రూ. 15 లక్షల విలువ చేసే మరో రోలెక్స్ గడియారానికి రూ. 2,94,000 మాత్రమే చెల్లించారు. ఇలా మూడోవంతు కంటే తక్కువగా చెల్లించి పలు కానుకలను ఇంటికి చేర్చుకున్న ఇమ్రాన్ రూ.8 లక్షల కానుకలను రూపాయి కూడా ఖజానాకు జమ చేయకుండానే తీసుకొన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకొన్నారని మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు.
ఎన్నికల్లో పోటీకి అనర్హత
ఇమ్రాన్ ఖాన్‌పై అనర్హత వేటు వేయడంతో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు వీల్లేకుండా పోయింది. ఈ నెల 9 న జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్నట్టు దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆ తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇమ్రాన్‌పై అనర్హత వేటుపడడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పోటీ చేస్తారని ప్రధాని షెహబాజ్ ఇప్పటికే ప్రకటించారు.