Friday, November 22, 2024

పాక్ ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ అభ్యర్థుల హవా

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుతో ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వారు మెజారిటీ స్థానాలకు గెలుచుకున్నారు. ఎన్నికలు జరిగి రెండు రోజులయినా ఇప్పటివరకు పూర్తి ఫలితాలు వెలువడకపోవడంతో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. మొత్తం జాతీయ అసెంబ్లీలోని 266 స్థానాలకు గాను 265 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇప్పటివరకు 201 స్థానాల ఫలితాలను మాత్రమే ప్రకటించారు. వీటిలో 55 చోట్ల ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్‌ఇ ఇన్సాఫ్(పిటిఐ) మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 86మంది గెలుపొందారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్ ( పిఎంఎల్‌ఎన్)59 స్థానాల్లో గెలుపొందగా బిల్వాల్ భుట్టో జర్దారీ పార్టీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ( పిపిపి)44 స్థానాల్లో విజయం సాధించింది.

మిగతా 12 స్థానాలు చిన్నా చితకా పార్టీలకు దక్కాయి. పాక్ ఎన్నికల బరిలో చాలా పార్టీలే ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ మూడు పార్టీ మధ్యే పోటీ ఉంది. ఇమ్రాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు నిషేధించడంతో పాటుగా ఆయన పార్టీకి ‘బ్యాట్’ గుర్తుకూడా దక్కలేదు. దీనితో ఆయన పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా నిలబడ్డారు. పిఎంఎల్‌ఎన్ పార్టీ తరఫున గెలుపొందిన ప్రముఖుల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన సోదరుడు, మా. ఈ పధాని షెహబాజ్ షరీఫ్‌తో పాటుగా ఆయన కుమారుడు హంజా షెహబాజ్, నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ ఉన్నారు. కాగా పీకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకులు ఆసిఫ్ అలీ జర్దారీ, ఆయన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు బిల్వాల్‌లు తమ నియోజకవర్గాల్లో విజయానికి చేరువలో ఉన్నారు. మరో వైపు పిటిఐ పార్టీ మాజీ నాయకుడు, రక్షణ మంత్రి పెర్వైజ్ ఖట్టక్ ఉన్నారు. ఇక ప్రొవెన్షియల్ అసెంబ్లీలకు సంబంధించి సింధ్ అసెంబ్లీలో ఇప్పటివరకు 53 నియోజకవర్గాల ఫలితాలను ఇసి ప్రకటించగా,

పిపిపి 45 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్లు నాలుగు చోట్ల మాత్రమే గెలుపొందారు, అలాగే ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా అసెంబ్లీలో ఫలితాలు ప్రకటించిన 50 స్థానాల్లో 45 చోట్ల ఇమ్రాన్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన ఇండిపెండెంట్లు గెలుపొందారు. అలాగే పంజాబ్ అసెంబ్లీలో పిఎంఎల్‌ఎన్ 39 చోట్ల గెలుపొందగా, ఇండిపెండెంంట్లు 33 చోట్ల, ముత్తహిదా క్వామి మూవ్‌మెంట్( ఎంక్యుఎం), జమాత్‌ఎ ఇస్లామీ చెరో చోట గెలుపొందాయి.
మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: నవాజ్ షరీఫ్
ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్లు మెజారిటీ స్థానాల్లో గెలుపొందినప్పటికీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాను మాజీ ప్రధాని, పిఎంఎల్‌ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్ వ్యక్తం చేశారు. పూర్తి ఫలితాలు వెలువడేటప్పటికి తమ పార్టీయే అతిపెద్ద పార్టీగా నిలుస్తుదన్న ఆయన ఇండిపెండెంట్ల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అయితే తాము పిపిపితో కానీ, పిఎంఎల్‌ఎన్‌తో కానీ పొత్తు పెట్టుకోబోమని ఇమ్రాన్ పార్టీ నేత బారిస్టర్ ఖాన్ అంటూ తమ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ మొత్తం 336 స్థానాలుండగా, వీటిలో 266 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాల్లో 10 మైనారిటీలకు, 60 మహిళలకు రిజర్వ్ చేస్తారు. వీటిలో ఆయా పార్టీలు గెలచిన స్థానాలను బట్టి దామాషాపద్ధతిలో కేటాయిస్తారు.ఈ సారి 265 స్థానాలకే ఎన్నికలు జరిగినందున ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీకయినా కనీసం 135 స్థానాలు అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News