ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీపై నిషేధం
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై దేశ ఎన్నికల సంఘం వేటేసింది. ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేయరాదు, ఏ పదవిని చేపట్టడానికి వీల్లేదు. ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ నేతల నుంచి ఆయన అందుకున్న విలువైన కానుకల విక్రయ సంబంధిత తోషాఖానా కేసు సంబంధించి ఎన్నికల సంఘం ఈ తీవ్రచర్య తీసుకుంది. ఈ కానుకల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను దాచి పెట్టారని ఇమ్రాన్‌పై అభియోగాలు ఉన్నాయి. ఎన్నికల ప్రధానాధికారి సికందర్ సుల్తాన్ రజాతో కూడిన నలుగురు సభ్యుల ఎన్నికల సంఘం ఏకగ్రీవంగా ఇమ్రాన్‌పై అనర్హత నిర్ణయం తీసుకుని దీనిని అధికారికంగా వెలువరించింది. ఇప్పటి ఈ అసాధారణ నిర్ణయంతో ఇమ్రాన్ ఖాన్ దేశంలో ఎన్నికలలో పోటీ చేసే వీలుండదు.
తనకు వచ్చిన కానుకల విక్రయం విషయంలో ప్రధాని హోదాలో ఇమ్రాన్ అత్యంత దారుణ రీతిలో వ్యవహరించారని, అక్రమ పద్ధతులకు పాల్పడ్డారని, అధికారిక అమ్మకాలలో వీటిని తక్కువ ధరకు తాను తీసుకోవడం తరువాత వీటిని అత్యధిక ధరలకు అమ్ముకుని సొమ్ముచేసుకోవడం వంటి పరిణామాలు అనైతికం అని ఎన్నికల సంఘం పేర్కొంది. పిపిపి ఛైర్మన్ అయిన ఇమ్రాన్ ఖాన్ ఎంపి హోదాను కోల్పోతారు. ఎంపిగా పోటీ చేయడానికి వీలుండదు. అయితే ఇది అక్రమ నిర్ణయం అని, తమ పార్టీకి ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఆదరణను చూసిసహించలేకనే ఈ విధంగా అధికార పక్షం డొంకతిరుగుడుగా ఇసి ద్వారా ఈ చర్యకు దిగిందని ఇమ్రాన్ పార్టీ వర్గాలు విమర్శించాయి. ఈ నిర్ణయాన్ని తాము సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెలిపాయి.