ఇంధన ధరల తగ్గింపుపై ఇమ్రాన్
ఇస్లామాబాద్ : ఇంధన ధరల తగ్గింపు పట్ల భారతదేశాన్ని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి అభినందించారు. రష్యా నుంచి తక్కువ రేట్లకు చమురు తెప్పించుకోవడం వల్లనే ఇది సాధ్యం అయిందన్నారు. తక్కువ రేటుకు అదీ ఇప్పటి దశలో ముడిచమురును రష్యా నుంచి తెప్పించడం సాధారణ విషయమేమీ కాదని చెప్పారు. ఇంధన ధరల తగ్గింపు , ఇంతకు ముందటిలాగానే వంటగ్యాసు సిలిండర్లపై సబ్సిడీని పునరుద్ధరించడం జరుగుతుందని కేంద్రం తెలిపింది. ఓ వైపు క్వాడ్‌లో సభ్య దేశం అయినప్పటికీ , అమెరికా ఒత్తిళ్లను అధిగమిస్తూ రష్యా నుంచి చౌక ఇంధనం సమకూర్చుకుందని ఇది కొనియాడ తగ్గ విషయం, ఇదంతా కూడా భారతదేశపు స్వతంత్ర విదేశాంగ విధానంతోనే సాధ్యం అయిందన్నారు. తన హయాంలో తాను పాకిస్థాన్ ప్రయోజనాలనే కీలకంగా మల్చుకున్నానని, అయితే ఇందుకు ప్రతిబంధకంగా స్థానిక మీర్ జాఫర్లు, మీర్ సాధిఖులు విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గారని , ఈ క్రమంలో తాను పక్కకు వైదొలగాల్సి వచ్చిందని ఇప్పుడు తల తెగిన కోడి పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ తోకకొట్టుకొంటోందని అన్నారు.