ప్రధాని షెహబాజ్ ఆరోపణ
ఇస్లామాబాద్: దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టించడానికి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుట్రలు పన్నుతున్నారంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. దేశంలోని జాతీయ సంస్థలపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆయన ఇమ్రాన్ ఖాన్‌ను హెచ్చరించారు. గతనెలలో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత తమకు రాజకీయాలు ఆపాదించడానికి జరుగుతున్న ప్రయత్నాలను దేశంలోని అత్యున్నతమైన సైన్యం తీవ్రంగా ఖండించింది.
ఈ నేపథ్యంలో ప్రధాని షరీఫ్ ఈ హెచ్చరికలు జారీచేశారు. అవిశ్వాసన తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని కోల్పోయిన 69 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ స్వతంత్ర విదేశీ విధానాన్ని అవలంబిస్తున్న కారణంగానే తమ ప్రభుత్వాన్ని అమెరికా స్ధానిక రాజకీయ పార్టీల మద్దతుతో కూల్చివేసిందని ఆరోపించారు. అబొట్టాబాద్‌లో ఒక ర్యాలీలో ఆదివారం రాత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రసంగాన్ని పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పన్నిన భారీ కుట్రగా షెహబాజ్ అభివర్ణించారు.