నేడు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారు
న్యూఢిల్లీ: క్రికెటర్ నుంచి పాకిస్థాన్ ప్రధానిగా 2018లో బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ నేడు(శుక్రవారం) అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాలు ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాయి. పాకిస్థాన్ పార్లమెంటు ఈ రోజు ఉదయం నుంచి తన కార్యక్రమాలు మొదలుపెట్టింది. పాకిస్థాన్ తెహరీక్‌ఎఇన్సాఫ్(పిటిఐ) నేతృత్వపు ప్రభుత్వం నుంచి అనేక మంది వైదొలిగినందున పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ మెజారిటీని కోల్పోయారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. తీర్మానానికి ముందే ఆయన్ని ప్రతిపక్షాలు అధికారం నుంచి దిగిపొమ్మని కోరగా ‘ఏమి జరిగినా నేను రాజీనామా చేయను’ అని ఆయన కార్యాలయం బుధవారం ఓ ప్రకటన చేసింది. పోరాడకుండా లొంగిపోయే ప్రశ్నే లేదన్నారు. క్రూక్స్ ఒత్తిడికి తానెందుకు అధికారం నుంచి తప్పుకోవాలని ప్రశ్నించారు.
పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ కార్యదర్శి గురువారం అవిశ్వాస తీర్మానం సహా శుక్రవారం జరుగనున్న సమావేశానికి సంబంధించిన 15 పాయింట్ల ఎజెండాను జారీ చేశారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ అధ్వానంగా తయారవ్వడం, ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. చాలామంది విపక్షనేతలను జైలులో పడేసి రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగడానికి ఇది కూడా కారణం. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయనందుకుగాను ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన దాదాపు 20 మంది సభ్యులు పార్టీని వదిలేశారు. వారు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఓటేస్తారని తెలుస్తోంది. ఇదిలావుండగా వారు తిరిగిరావాలని వినతి చేయడమే కాకుండా, పార్టీకి ద్రోహంచేసిన వారిని జీవితాంతం నిషేధించాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ను కూడా ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేశారు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వంకు ఉండాల్సిన మెజారిటీ మార్క్ 172. కాగా పిటిఐ 179 మద్దతుదార్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇమ్రాన్ ఖాన్ పిటిఐ పార్టీకి ఉన్న స్వంత బలం కేవలం 155 మంది సభ్యులే. ఇదిలావుండగా ఇమ్రాన్ ఖాన్ పిటిఐ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్షాలకు 163 సీట్ల కమాండ్ ఉందని తెలుస్తోంది. పాకిస్థాన్‌కు సంబంధించిన ఏ ప్రధాని కూడా పూర్తి ఐదేళ్ల పాలనను కొనసాగించలేదు. పాకిస్థాన్ తదుపరి సార్వత్రిక ఎన్నికలు 2023 చివర్లో జరగాల్సి ఉన్నాయి. అయితే ఎన్నికలు ముందస్తుగానే జరగొచ్చని ఆంతరంగిక మంత్రి షేఖ్ రషీద్ సూచించారు. పాకిస్థాన్‌లో మిలిట్రీ ఎప్పుడూ పౌర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుంటుంది. అయితే ఈ వాదనను అటు మిలిట్రీ, ఇటు ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చుతున్నారు.