పాకిస్తాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కు మరోసారి జైలు శిక్ష పడింది. ఆయన వివాహం చట్టవిరుద్ధమని తేల్చిన పాకిస్తానీ కోర్టు.. ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. వారం రోజుల వ్యవధిలో ఇమ్రాన్ కు జైలు శిక్ష పడటం ఇది మూడోసారి.
ఇమ్రాన్ ప్రస్తుత భార్య బుష్రా బీబీ మొదటి భర్త ఖవర్ మనేకా ఈ కేసు వేశారు. బుష్రా బీబీ తనకు విడాకులు ఇచ్చి, మరో వివాహం చేసుకునే ప్రక్రియలో ‘ఇద్దత్’ పేరిట వ్యవహరించే విరామం పాటించలేదని, అందువల్ల ఇమ్రాన్-బుష్రాల వివాహం చెల్లదని కేసు వేశారు. పైగా ఇమ్రాన్ కు బుష్రా బీబీతో పెళ్లికి ముందే అక్రమ సంబంధం ఉందని కూడా ఆయన ఆరోపించారు.
ఇమ్రాన్ కు ఇటీవలే సైఫర్ కేసులో పదేళ్ల జైలు శిక్ష, తోషోఖానా కేసులో 14 ఏళ్ల శిక్ష పడిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ లో సాధారణ ఎన్నికలు మరో ఐదు రోజుల్లో జరుగుతాయనగా, ఇమ్రాన్ కు వరుసగా జైలుశిక్షలు పడటం గమనార్హం.