ఇస్లామాబాద్ : తన లాంగ్‌మార్చ్ పాకిస్థాన్‌లో ఆగినచోటి నుంచే తిరిగి మంగళవారం ప్రారంభం అవుతుందని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆదివారం తెలిపారు. ఇది దేశ రాజధాని ఇస్లామాబాద్ వరకూ సాగుతుందని స్పష్టం చేశారు. గురువారం వజీరాబాద్‌లో యాత్ర దశలో జరిగిన కాల్పులతో ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. రెండు రోజుల విరామం ప్రకటించారు. అయితే తిరిగితన పర్యటన తనపై దాడి జరిగిన చోటి నుంచే ఎల్లుండి నుంచి ఆరంభం అవుతుందని ఆయన తెలిపారు. తాను, ఇతరులు గాయపడ్డారని, తమ పార్టీ కార్యకర్త ఒకరు బలి అయ్యారని, అయితే ఇటువంటి ఘటనలకు భయపడేది లేదని , దేశాన్ని అరాచకం నుంచి రక్షించేందుకు తన లాంగ్‌మార్చ్ సాగుతుందని ప్రకటించారు.
కాల్పులు జరిగిన చోట ఆగిన తన ప్రసంగం తిరిగి సాగుతుంది. తరువాత లాహోర్‌కు అక్కడి నుంచి కనీసం 14 రోజులలో రావల్పిండిలో సభల వరకూ సాగుతుందని ఇమ్రాన్ చేసిన ప్రకటన ఆయన పార్టీ పిటిఐకి చెందిన సామాజిక మాధ్యమాల ద్వారా వెలువడింది. మరో వైపు ఇమ్రాన్‌ఖాన్‌ను పాకిస్థాన్ అధ్యక్షులు అరిఫ్ అల్వీ ఆదివారం కలిశారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే దశలో దేశంలోని ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయసాధనకు ప్రతిపక్షాలు, ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. దేశంలో పలు కీలక విషయాలపై విపక్షాలు, ప్రభుత్వం మధ్య వివాదాలతో విధాన నిర్ణయాలు మూలకు పడుతున్న వైనాన్ని ఇమ్రాన్‌తో ప్రెసిడెంట్ చర్చించినట్లు తెలిసింది. సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించుకుంటేనే దేశం భవిత కుదుటపడుతుందని లేకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని అధ్యక్షులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ తరువాత స్పష్టం అయింది.