ఇస్లామాబాద్ : తనపై వచ్చిన అవిశ్వాస తీర్మానంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. దేశ అటార్నీ జనరల్‌ను కలుసుకుని ఈ అంశంపై ఆయన నుంచి న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్నారు. దేశంలో తీవ్రస్థాయి ద్రవ్యోల్బణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొంటూ ప్రతిపక్షం ఇమ్రాన్ సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదించాయి. ఈ దశలో ఇమ్రాన్‌ఖాన్ అటార్నీ జనరల్ ఖాలీద్ జావెద్ ఖాన్‌ను కలుసుకున్నారు. న్యాయపరంగా తలెత్తే పరిణామాలపై ఆయనతో విశ్లేషించారు. ప్రతిపక్షాల తీర్మానాన్ని వీగిపొయ్యేలా చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ సారథ్యపు పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పిటిఐ) అన్ని ప్రయత్నాలు చేపట్టింది. ప్రతిపక్షాలైన పిపిపి, పిఎంఎల్ ఎన్‌కు చెందిన దాదాపు వంద మంది ఎంపీలు మంగళవారం జాతీయ అసెంబ్లీలో తీర్మానానికి నోటీసు పంపించాయి. దీనితో దేశంలో రాజకీయ ప్రకంపనలు ఆరంభం అయ్యాయి. అయితే తనకు అన్ని విధాలుగా బలం ఉందని, సైన్యం మద్దతు తనకే ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ దీమా వ్యక్తం చేశారు.