Saturday, December 28, 2024

ఇమ్రాన్ పార్టీ నిరసనల్లో ఆరుగురు భద్రత సిబ్బంది మృతి

- Advertisement -
- Advertisement -

100 మందికి పైగా భద్రత సిబ్బందికి గాయాలు
పాక్ సైన్యానికి ‘షూట్ ఎట్ సైట్’ ఉత్తర్వులు
ఇస్లామాబాద్: జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారగా నలుగురు పారా మిలిటరీ సిబ్బంది, ఇద్దరు పోలీస్ సిబ్బంది మృతి చెందినట్లు, 100 మందికి పైగా భద్రత సిబ్బంది గాయపడినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా వెల్లడించింది. నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడంతో ఫెడరల్ ఫ్రభుత్వం మంగళవారం షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులతో పాటు సైన్యాన్ని రాజధానిలో మోహరించవలసి వచ్చినట్లు మీడియా తెలియజేసింది. ఖాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) మద్దతుదారులు ఇస్లామాబాద్ డి చౌక్ వేదిక వద్దకు అవరోధాలు తొలగిస్తూ చొచ్చుకురావడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య సైన్యాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం మోహరించింది.

మరొక వైపు ‘కర్ఫూ విధించవలసి వచ్చినా సరే’ వారి యత్నాన్ని భగ్నం చేస్తామని ప్రభుత్వం శపథం చేసింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఇస్లామాబాద్‌లోని శ్రీనగర్ హైవేపై ఒక వాహనం పాకిస్తాన్ రేంజర్స్ సిబ్బంది మీదకు దూసుకునపోగా నలుగురు రేంజర్స్ అధికారులు మరణించినట్లు, మరి ఐదుగురు రేంజర్స్ సిబ్బంది, పలువురు పోలీస్ అధికారులు తీవ్రంగా గాయపడినట్లు రేడియో పాకిస్తాన్ వెల్లడించింది. ఆ ప్రదేశం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో తుపాకులు, మందుగుండు సామగ్రి చేతబూనిన కొందరు దుందగులు రేంజర్స్ సిబ్బందిపై రాళ్లు రువ్వినట్లు, రావల్పిండిలో చుంగి నం26 వద్ద భద్రత సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు సాగించినట్లు రేడియో పాకిస్తాన్ తెలియజేసింది. ఇద్దరు పోలీస్ సిబ్బంది హతులైనట్లు కూడా రేడియో తెలిపింది. కానీ వివరాలు ఏవీ ఇవ్వలేదు. పంజాబ్ పోలీసుల సమాచారం ప్రకారం, పిటిఐ నిరసనకారులతో సంఘర్షణల్లో ఇస్లామాబాద్ శివార్లలో హక్లా కూడలి వద్ద ఒక పోలీస్ మరణించాడు.

కానీ రెండవ పోలీస్ గురించిన వివరాలను వారు ఇవ్వలేదు. పాకిస్తాన్ దేశీయాంగ శాఖ మంత్రి మోహ్సిన్ నఖ్వి సోమవారం రాత్రి పొద్దు పోయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ.. వంద మందికి పైగా భద్రత సిబ్బంది గాయపడ్డారని, వారిలో చాలా మంది పోలీసులు అని తెలిపారు. ‘నిరసనకారులు రాళ్లు రువ్వడం వల్ల పోలీస్ సీనియర్ అధికారి ఒకరు(ఎస్‌పి) తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు తలపై తీవ్రమైన గాయం తగిలింది’ అని నఖ్వి చెప్పారు. ‘ఉక్కు పిడికిలితో దుండగులను అణచివేసేందుకు’ పాకిస్తాన్ సైన్యాన్ని పిలిపించినట్లు, ‘దుండగులు, అల్లరిమూకలను కనిపిస్తే కాల్చివేతకు విస్పష్ట ఉత్తర్వులు జారీ చేసినట్లు’ రేడియో పాకిస్తాన్ తెలిపింది. కాగా, రేంజర్స్. పోలీస్ సిబ్బందిపై దాడిని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండిస్తూ, ఆ ఘటనల్లో పాల్గొన్నవారిని తక్షణం గుర్తించి, కఠిన చర్య తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News