ఏప్రిల్ 3న అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనబోతున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ దిగువ సభలో ఉన్న 342లో 172 ఓట్లు వస్తేనే ఇమ్రాన్ ఖాన్ పదవి పదిలంగా ఉండగలదు. లేకుంటే అంతే సంగతులు. ఆయనకు ప్రస్తుతం ఉన్న ఆప్షన్లు మూడు అవి: రాజీనామా, అవిశ్వాసం తీర్మానాన్ని ఎదుర్కొనడం, ఎన్నికలు. ‘ఎస్టాబ్లిష్మెంట్’ తనకీ ఆప్షన్లు ఇచ్చిందన్నారే కానీ ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏమిటన్నది వివరించలేదు. పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లయినప్పటికీ అందులో సగం వరకు ఆ దేశంలో సైనికపాలనే ఉంది. పాకిస్థాన్ లో ఇప్పుడున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ ఛీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా ఈ వారం ప్రధానిని కలిశారు. ప్రతిపక్షం ఆయనకు ముందస్తు ఎన్నికలు, లేక రాజీనామా వంటి ఆప్షన్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. కాగా ‘తనకు మూడు ఆప్షన్లు ఇచ్చారు’ అని ఇమ్రాన్ ఖాన్ ఎఆర్ వై న్యూస్ కు తెలిపాడు.
‘అవిశ్వాసం తీర్మానానికి భయపడి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. ఎన్నికలే ఉత్తమ ఐచ్చికం అని మేము భావిస్తున్నాం. ఏదేమైనా చివరి వరకు పోరాడతాం’ అని ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు. తమ పార్టీ నుంచి చాలా మంది జంప్ అయ్యారని, ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గినా ప్రభుత్వాన్ని నడుపలేము. అందుకనే ఎన్నికలకు పోవడమే మంచిదనిపిస్తోంది’ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఆయన చెప్పినట్టు ‘డాన్’ పత్రిక రాసింది. విశేషమేమిటంటే ఇంతవరకు పాకిస్థాన్ లో ఏ ప్రధాని పూర్తి పదవి కాలాన్ని పూర్తిచేయనేలేదు.