Wednesday, January 22, 2025

పాక్‌లో నవాజ్ సంకీర్ణ ప్రభుత్వమే

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అటు జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్( పిటిఐ), మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ నవాజ్ పిఎంఎల్‌ఎన్) వేటికవే విజయాన్ని ప్రకటించుకుంటున్నాయి. అయితే ఓట్ల లెక్కింపు మొదలయి దాదాపు 48 గంటలయినా ఫలితాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం జాతీయ అసెంబ్లీలో ఎన్నికలు జరిగిన 265 స్థానాలకుగాను (అభ్యర్థి మృతితో ఒక స్థానానికి ఎన్నిక వాయిదా పడింది)ఎన్నికల కమిషన్ 255 స్థానాల ఫలితాలను ప్రకటించింది. వీటిలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన ఇండిపెండెంట్లు 101 సీట్లు గెలుచుకున్నారు. పిఎంఎల్‌ఎన్ 73 స్థానాలతో రెండో స్థానంలో ఉండగా బిల్వాల్ భుట్టో జర్దారి నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ( పిపిపి) 54 సీట్లలో విజయం సాధించాయి.ముత్తహిదా క్వామి మూవ్‌మెంట్( ఎంక్యుఎం) 17 స్థానాల్లో విజయం సాధించగా, మిగతా స్థానాలు చిన్నా చితకా పార్టీలకు దక్కాయి. మరో 10 స్థానాల ఫలితాలు మాత్రమే ప్రకటించాల్సి ఉండడంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 135 సీట్లు ఏ పార్టీకి లభించే అవకాశాలు లేవు.

దీంతో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దేశంలో రాజకీయ, ఆర్థిక సుస్థిరతను తీసుకు వచ్చేందుకు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పిఎంఎల్‌ఎన్, పిపిపి కలిసి పని చేయాలని అంగీకారానికి వచ్చాయి. దీనిలో భాగంగా ఇరు పక్షాలకు చెందిన నేతలు శుక్రవారం రాత్రి లాహోర్‌లో సమావేశమయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రభుత్వం ఏర్పాటుపై తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ కూడా కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటుపై మిత్ర పక్షాలతో చర్చలు జరుపుతోంది. అయితే నవాజ్ షరీఫ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మరో వైపు శనివారం అర్ధరాత్రికల్లా పూర్తి ఫలితాలను ప్రకటించని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఇమ్రాన్ ఖాన్ పార్టీ హెచ్చరించింది. పాక్ ఎన్నికల కమిషన్ తన రాజ్యాంగ విధిని నిర్వర్తించడంలో విఫలమయిందని ఆ పార్టీ నేత గోహర్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. తమ పార్టీ ఇప్పటికే 170 సీట్లు గెలుచుకుందని చెప్పిన ఆయన కేంద్రంతో పాటు ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్‌లోకూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల తీర్పును గౌరవించాలని ఆయన అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా వ్యవస్థలకు విజ్ఞప్తి చేశారు.

సుస్థిర ప్రభుత్వానికి ఆర్మీ పిలుపు
ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ విజయవంతమయిందంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికలు, ప్రజాస్వామ్యం దేశ ప్రజలకు సేవ చేయడం కోసమేనని అన్నారు. ‘స్వప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. 25 కోట్ల మంది ప్రజల కోసం అరాచక పాలనకు దూరంగా సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి’ అంటూ ప్రకటన చేశారు. పాక్ పాలనా వ్యవహారాల్లో సైన్యానికి తిరుగులేనిఆధిపత్యం ఉంటున్న నేపథ్యంలో మునీర్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్థాన్ రాజ్యాంగం పట్ల దేశ ప్రజలు తమ తిరుగులేని నమ్మకాన్ని ప్రదర్శించారని, రాజకీయ పరిపక్వత, ఐక్యతతో అదే విశ్వాసాన్ని కనబరచాల్సిన బాధ్యత ఇప్పుడు రాజకీయ పార్టీలపైన ఉందని మునీర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News