ఇస్లామాబాద్: ఇరుగుపొరుగు దేశాలయిన భారత్, పాకిస్థాన్‌ల మధ్య విభేదాల పరిష్కారానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో టీవీలో చర్చించాలని అనుకొంటున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. చర్చల ద్వారా విభేదాలు పరిష్కరింపబడితే అది భారత ఉపఖండంలోని బిలియన్లకు పైగా ఉన్న ప్రజలకు మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యాలో రెండు రోజుల పర్యటనకోసం వెళ్తున్న ఇమ్రాన్ ఖాన్ రష్యా అధికారిక టీవీ నెట్‌వర్క్ ‘ఆర్‌టి’కిచ్చిన ఇంటర్వూలో ఈ విషయం చెప్పారు. పైగా భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంతో వాణిజ్యం తగ్గిపోయిందని ఇమ్రాన్ చెప్పారు.అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండడమే తమ ప్రభుత్వ లక్షమని అన్నారు.2018లో తమ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరు దేశాలు కూర్చుని చర్చించుకుందామని, కశ్మీర్ సమస్యను పరిష్కరించుకుందామని భారత్‌కు ప్రతిపాదించామని, అయితే తన సూచనకు భారత్ దీనికి సానుకూలంగా స్పందించలేదని ఆయన అన్నారు.
2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు దిగజారిపోయిన విషయం తెలిసిందే.పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ జరపడంతో ఈ సంబంధాలు మరింత దిగజారాయి. ఉగ్రవాద రహిత వాతావరణంలో మాత్రమే పాక్‌తో చర్చలు జరుగుతాయని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా రష్యాఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న తరుణంలో రష్యాలో పర్యటిస్తున్న ఇమ్రాన్ ఈ అంశంపైన కూడా స్పందించారు. సైనిక ఘర్షణలపై తనకు విశ్వాసం లేదన్న ఆయన రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం శాంతియుత పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.