Wednesday, January 22, 2025

వ్యవసాయరంగంలో డా. స్వామినాధన్ సిఫార్సులు సజీవం

- Advertisement -
- Advertisement -

రైతుల ఆదాయం రెట్టింపుతోనే నిజమైన నివాళి
మద్దతు ధరలకు చట్టం అమలు చేయాలి

మనతెలంగాణ/హైదరాబాద్: ఆయన పరిశోధనలు వ్యవసాయరంగానికి దిక్సూచిగా నిలిచాయి.. దేశ ఆర్ధిక ప్రగతికి బాటలు వేశాయి. కోట్లాదిమంది ప్రజలకు ఆహారభద్రత కల్పించాయి. హరిత విప్లవ పితామహుడుగా పేరుపొందిన డా.ఎం.ఎస్. స్వామినాధన్ మన మధ్య లేకపోయినా ఆయన రైతులకోసం చేసిన కృషి ప్రతియేటా పంటపొలాల్లో విత్తనమై మొలకెత్తుతూనే ఉంటుంది. ఆయన ఆశయాలు కొట్లాదిమంది పల్లెల్లో ఆకలి తీర్చే అన్నం మెతుకుల రూపంలో పూటపూటనా ఆకలి తీరుస్తూనే ఉంటాయి . వ్యవసాయరంగం సంక్షేమం కోసం క్షేత్ర స్థాయి అధ్యయనంతో వాస్తవికతను ప్రతిబింబించేలా ఆయన క్రేంద్ర పభుత్వానికి అందజేసిన నివేదిక , రైతులకోసం ఆయన చేసిన సిఫార్సులు సజీవంగానే ఉంటాయి. ప్రకృతి వైపరిత్యాలకు ఎదురొడ్డి ఆరుగాలం శ్రమిస్తూ ధాన్యపు రాసులను పండిస్తూ దేశ ప్రజలకు ఆహారభద్రత కల్పిస్తూ తాను తన కుటుంబం పంటలసాగుకు పెట్టిన పెట్టుబడి ఖర్చులైనా దక్కక , అప్పులవూబిలో చిక్కుకుపోతూ చేస్తున్న ఆక్రందనలు , ఆత్మహత్యలు స్వామినాధన్ కమిటీ డిమాండ్ల రూపంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు పాలకులకు ములుకుల్లా గుచ్చుకుంటూనే ఉంటాయి.

రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్‌లో డా.స్వామినాధన్ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలు , రైతుల కష్టనష్టాలు, ఈ రంగం పట్ల ప్రభుత్వం మార్చుకోవాల్సిన విధానాలు ,పంటల సాగులో రైతులకు అందచేయాల్సిన అదనపు సాయాలు తదితర అంశాలపై చేసిన ప్రసంగాలు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. వ్యవసాయరంగంలో పంటల సాగుకోసం రైతులు చేసిన ఉత్పత్తి వ్యయంలో అదనంగా 50శాతం చేర్చి పంటలకు కనీస మద్దతు ధరలు అమలు చేయాన్న డా.స్వామినాధన్ ప్రధాన డిమాండ్ దశాబ్ధాలు గడుస్తున్నా ఇంకా డిమాండ్‌గానే మిగిలిపోయింది. జాతీయ రైతు కమీషన్ చైర్మన్‌గా ఉన్న సమయంలో స్వామినాధన్ పంటలకు కనీస మద్ధతు ధరలకు సంబంధించి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.

ఈ నివేదికను అప్పటి యూపిఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్డీఏ పభుత్వం అధికారంలోకి వస్తే స్వామినాధన్ కమిటీ నివేదికన యథాతథంగా అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చిన ఆ నాటి ప్రధాని అభ్యర్ది నరేంద్ర మోడీ రైతులను నమ్మించారు. రైతుల మద్దతుతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ పదేళ్లు పాటు ప్రధానిగా ఉన్నా కనీసం స్వామినాధన్ కమిటీ నివేదికను పట్టించుకోలేదన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. దేశమంతటా 2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పదే పదే బహిరంగ ప్రకటనల ద్వారా రైతులను నమ్మించిన ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికీ ఆ దిశగా, అమలులో అడుగులు వేయించలేకపోయారు. కనీసం డా.స్వామినాధన్ మృతి తర్వాతనైనా ఆయన రైతులకోసం చేసిన సిఫార్సులు , వ్యవసాయరంగం పట్ల ఆయన ఆశయాలు , ప్రభుత్వం ఫలింపచేసిననాడే పాలకులు ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్టవుంతుందని రైతులు రైతు సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News