కరీంనగర్:భవిష్యత్తులో ఆసక్తి కలిగిన విద్యార్థులు రాజకీయ రంగంపై ఆలోచన చేసి ప్రజలకు సేవలందించాలని నగర మేయర్ వై సునీల్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కరీంనగర్ నగరపాలకసంస్థలో లక్ష్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. కార్యాలయంలోని సమావేశ మందిరంలో మేయర్‌తో ముఖాముఖి సమావేశమయ్యారు.
రాజకీయ రంగ ప్రవేశం, మేయర్ పరిపాలన విధానం, బాధ్యతలు, వారి రాజకీయ జీవితం, నగరపాలకసంస్థ పరిపాలన విధానం, మున్సిపల్‌లో విభాగాలు వాటి పనితీరు, నగరపాలకసంస్థ చేపడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై విద్యార్థులు వారి సందేహాలను మేయర్‌ను అడిగి తెలుసుకున్నారు.
దీంతో మేయర్ విద్యార్థుల సందేహాలకు సమాధానమిస్తూ క్లుప్తంగా వివరించి నగరపాలకసంస్థలో పలు విభాగాలను చూపించి వాటి పనితీరును వివరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలకు వారి సేవల ద్వారా చాలా ప్రయోజనాలు కలగడమే కాకుండా ఆ ప్రాంతాలపై, పట్టణాలు, జిల్లాలు,రాష్ట్రాలు అభివృద్ధి బాట పడుతాయని తెలిపారు.
విద్యార్థులు ప్రతి రోజు పత్రికలు చదవడం, వార్త విశేషాలను తెలుసుకోవడం, సమాజం పట్ల అవగాహన పెంచుకోవడం లాంటివి దినచర్యగా చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ త్రియంభకేశ్వర్, లక్ష్ స్కూల్ యజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు.