కిలో మీటరుకు రూ.90 వసూలు చేయనున్న ఆటోడ్రైవర్లు
కొలంబో : విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరతతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో మంగళవారం చమురు దరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. మంగళవారం లీటర్ పెట్రోల్ ధర 24.3 శాతం అధికమై రూ.420 కి, లీటరు డీజిల్ ధర 38.4 శాతం అధికమై రూ400 కు చేరుకుంది. ఏప్రిల్ 19 తరువాత ధరల సవరణ జరగడం రెండోసారి. లీటర్ పెట్రోల్‌పై రూ. 82 పెరగ్గా, ఇప్పుడు రూ. 420 కి లభిస్తోంది. అలాగే లీటర్ డీజిల్‌పై అదనంగా రూ. 111 భారం పడటంతో రూ. 400 చెల్లించవలసి వస్తోంది. ఈ ఇంధన ధరలను భారీగా పెంచుతూ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది.
సవరించిన ధరలు మంగళవారం నుంచి అమలు లోకి వస్తాయని, ప్రతి 15 రోజులు లేక నెలకోసారి ఈ సవరణ ఉంటుందని, ఈ ధరల సవరణను కేబినెట్ ఆమోదించిందని శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కాంచన విజెశేకర ట్విటర్‌లో వెల్లడించారు. ప్రజలు పెట్రోలు బంకుల వద్ద క్యూల్లో నిల్చుని ఇబ్బంది పడుతుండగా ఈ సవరణ చోటు చేసుకుంది. ఈ ప్రభావంతో ఆటో డ్రైవర్లు భారీగా వసూలు చేస్తున్నారు. మొదటి కిలో మీటరుకు ప్రయాణికుడి నుంచి రూ.90, రెండో కిలో మీటరు నుంచి రూ. 80 తీసుకుంటామని ఆటో డ్రైవర్లు వెల్లడించారు. ఈ ఖర్చు తగ్గింపు విషయంలో కార్యాలయాల అధిపతులకు ప్రభుత్వం విచక్షణాధికారాలు ఇవ్వనుంది. ఉద్యోగుల వ్యక్తిగత హాజరు, ఇంటి నుంచి పనిచేసే విషయంలో వారు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఇంధన కొరతను తీర్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను పరిశీలిస్తోంది.