దేశ సంపదను మోడీ తన మిత్రులకు దోచి పెడుతున్నారు: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బిజెపితో పాటు వేరే పార్టీలకు బుద్ది చెప్పి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. రేవంత్‌తో పాటు రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్‌రావు ఠాక్రే, అంజన్‌కుమార్, వి.హనుమంతరావు, జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు, అభివృద్ధిని రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు గుర్తు చేసుకున్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిజెపి, బిఆర్‌ఎస్ నాణానికి బొమ్మ-బొరుసు లాంటివని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. వారిద్దరిదీ ఫెవికాల్ బంధమన్నారు. దేశ సంపదను మోడీ తన మిత్రులకు దోచి పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
మణిపూర్ మండుతున్నా ప్రధాని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసి మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది కూడా రాజీవ్ అని ఆయన కొనియాడారు. ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషితోనే ఐటీ ఇంత అభివృద్ధి చెందిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి నేడు అందరికీ అందుబాటులోకి తీసుకువ చ్చారని ఆయన గుర్తు చేశారు. పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారని ఆయన వివరించారు. పేదల కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీదేనని ఆయన ఆవేదన చెందారు. దేశంలో బ్రిటీష్ వారి విధానమైన విభజించు, పాలించు విధానాన్ని ఇప్పుడున్న బిజెపి అవలంభిస్తోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.