న్యూఢిల్లీ : ఢిల్లీ సెంట్రల్ ఏరియా లోని ఖాన్ మార్కెట్ వద్ద రెండు మహిళా పోలీస్టేషన్లను లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ పోలీస్‌లు చారిత్రకంగా ఈ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని సక్సేనా అభినందించారు. ఇలాంటి పోలీస్‌స్టేషన్లు ఢిల్లీలో ఏర్పాటు చేసే అవసరం ఎంతైనా ఉందన్నారు. బాధితులైన మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా మహిళా పోలీస్ అధికారులకు
విన్నవించే అవకాశం కలగడమే కాక, తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ మహిళా పోలీస్ బృందం ఉత్తమ కవాతు బృందంగా రిపబ్లిక్ పరేడ్‌లో నిర్వహించేలా ప్రయత్నించాలని ఢిల్లీ పోలీస్‌లకు సూచించారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీస్‌ల్లో 15.17 శాతం మంది మహిళా పోలీస్‌లు ఉన్నారని దీన్ని 33 శాతం వరకు సంఖ్య పెంచడానికి ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటికే నేరుగా నియామకాల ప్రక్రియను ఢిల్లీ పోలీస్‌లు ప్రారంభించారన్నారు.