Monday, December 23, 2024

జూలై 7న పాతబస్తీ లాల్‌దర్వాజా బోనాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట : తెలంగాణలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు జూలై 7వ తేదీ శుక్రవారం ప్రారంభమై 17వ తేదీ సోమవారం ముగుస్తాయని ఆలయ చైర్మన్ సి.రాజేందర్ యాదవ్ తెలిపారు. ఈ ఏడు అమ్మవారి 115వ బోనాలను ఎలాంటి వివాదాలకు తావులేకుండా అంతా కలిసికట్టుగా పనిచేసి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. గురువారం ఆలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి బి.బల్వంత్ యాదవ్, కోశాధికారి పోసాని సదానంద్ ముదిరాజ్, ఢిల్లీ బోనాల కన్వీనర్ జి.అరవింద్ కుమార్లతో కలిసి వివరాలు వెల్లడించారు.

జూలై ఏడు శుక్రవారం ఉదయం గణపతి హోమం, సప్తశతి పారాయణం, దేవి అభిషేకం, ధ్వజారోహణ, శిఖర పూజ, సాయంత్రం కలశస్థాపనతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయని, జూలై 9వ తేదీ ఆదివారం సాయంత్రం శాలిబండ కాశీవిశ్వనాథస్వామి దేవాలయం నుంచి అమ్మవారి ఘటాన్ని డప్పు వాయిద్యాలు, భాజా భజంత్రీలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించనున్నట్లు వివరించారు. ఆ తరువాత తొమ్మిది రోజుల అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. జూలై 16వ తేదీ ఆదివారం ఉదయం నుంచి అమ్మవారి బోనాల సమర్పణ, రాత్రికి ప్రపంచ శాంతి కల్యాణం, 17వ తేదీ సోమవారం పోతరాజు స్వాగతం, భవిష్యవాణి (రంగం), అమ్మవారి బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు.

ఉత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించనున్నట్లు తెలిపారు. ఆలయ అధికారిక పోతరాజుకు మాత్రమే బండారు ఇవ్వటం జరుగుతుందని, రంగం, ఊరేగింపు సాధ్యమైనంత తొందరగా ప్రారంభిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమ్మవారి అనుగ్రహంతో త్వరలో ఆలయ విస్తరణ జరుగనుందని, ఇందుకు అవసరమైన స్థలం కోసం రెవెన్యూ అధికారులు ఇప్పటికే సంబంధిత భవన యజమానులకు నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. మాట ప్రకారం ఆలయ విస్తరణ చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు, దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డికి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో మాజీ చైర్మన్లు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఢిల్లీలో 19న బోనాలు…
లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 19వ తేదీ సోమవారం నుంచి మూడు రోజుల పాటు బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ సి.రాజేందర్ యాదవ్, కన్వీనర్ జి.అరవింద్ కుమార్‌గౌడ్‌లు వివరించారు.

19వ తేదీ సోమవారం సాయంత్రం 5గంటలకు తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్ పలువురు ప్రముఖులు ప్రారంభిస్తారని, 20వ తేదీ మంగళవారం సాయంత్రం 5గంటలకు ఇండియా గేటు నుంచి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తెలంగాణ భవన్‌కు తీసుకొని వచ్చి ప్రతిష్టించుట, 21వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు పోతరాజు స్వాగతం, బోనాల సమర్పణ, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొనుట, ప్రత్యేక పూజలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, బంగారు బోనం సమర్పణ ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వంద మంది కళాకారులచే కళాప్రదర్శనలు, సాయంత్రం ఆరు గంటలకు అంబేద్కర్ ఆడిటోరియంలో ముగింపు కార్యక్రమం ఉంటుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News