Monday, December 23, 2024

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వరదల పోటు

- Advertisement -
- Advertisement -

Incessant rains in states of Maharashtra and Gujarat

నాసిక్ జిల్లాలో ఆరుగురు గల్లంతు
గొండియాలో ఇద్దరు గల్లంతు
గుజరాత్‌లో 14 మంది మృతి

నాసిక్/అహ్మదాబాద్ : మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంది వరదలు ముంచెత్తుతున్నాయి. మంగళ, బుధవారాల్లో అనేక దుర్ఘటనలు జరిగాయి. మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో గత 24 గంటల్లో వరదల్లో ఆరుగురు కొట్టుకుపోయారు. ఇప్పటికి ఒక మృతదేహం బయటపడింది. ఈ జిల్లా లోని పేఠ్, సుర్గణ, త్రయంబకేశ్వర్ తాలూకాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. నాసిక్ నగరంలో ముందురోజు కొన్ని గంటలు ఎడతెరిపి ఇచ్చినా మళ్లీ బుధవారం వర్షాలు భారీగా కురిశాయి. దిండోరి తాలూకాలో మంగళవారం అలంది నదిని దాటుతుండగా, ఆరేళ్ల బాలిక కొట్టుకుపోయింది. ఆమె మామయ్య బాలికను రక్షించడానికి వరద నీటిలో ఈదినా ఫలితం లేకపోయింది. పేఠ్ తాలూకాలో మౌజే పల్సీఖుర్ద్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి శిలాపూర్ గ్రామం సమీపాన గోదావరి నదిలో కొట్టుకుపోయాడు. ఇదే విధంగా మంగళవారం నార్ నదిని దాటుతున్న ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. మరో సంఘటనలో ఉప్పొంగి పారుతున్నవాగును దాటుతున్న ఇద్దరు మోటారిస్టులు వరద నీటికి కొట్టుకుపోయారు. వీరిలో ఒకరి మృతదేహం బయటపడింది. త్రయంబకేశ్వర్ లో మౌజే తలేగావ్ వద్ద కిక్వి నదలో ఒకరు మునిగిపోయారు. సురగణ తాలూకా అలంగుణ్ గ్రామం సమీపాన మంగళవారం చెరువుకు ఒకవైపు గండి పడి ఆ ప్రాంతమంతా జలమయమైంది. డార్నా, కడ్వా, గంగపూర్, అలంది, నందూర్ మధ్యమేశ్వర్, తదితర ఆనకట్టల నుంచి వరద నీటిని బయటకు పంపించినట్టు ఇరిగేషన్ విభాగం వెల్లడించింది.

గొండియాలో ఇద్దరు గల్లంతు

మహారాష్ట్ర గొండియా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నుల్లా వాగు ఉప్పొంగి వరద నీటికి ఇద్దరు గల్లంతయ్యారు. మృతులిద్దరూ పూజారిటోల గ్రామానికి చెందిన వారు. మృతదేహాల కోసం రిస్కూ బృందాలు గాలిస్తున్నాయి. గొండియా జిల్లాలో ఎనిమిది తాలూకాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా నదుల్లో రిజర్వాయర్లలో వరద నీటి మట్టం పెరుగుతోంది.

వైనగంగా నదిలోని ఆలయంలో చిక్కుకున్న 15 మంది

మహారాష్ట్ర లోని భండారా జిల్లాలో వైనగంగా నది మధ్యలో గల మాడ్గీ ఆలయంలో 15 మంది భక్తులు చిక్కుకు పోయారు. గురుపూర్ణిమ సందర్భంగా వీరు పడవపై నది మధ్య లోని ఆలయానికి పూజలు చేయడానికి వెళ్లారు. అంతలో నది ఉప్పొంగడంతో వారంతా ఆలయం లోనే ఉండిపోయారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు వారిని రక్షించడానికి వెళ్లాయని, అయితే వారు ఆలయంలో సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

పాల్ఘర్ జిల్లాలో ఇంటిపై బండరాయి పడి ఇద్దరు మృతి

మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో కుండపోత వర్షాలతో ఒక ఇండిపై కొండరాయి పడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వసాయి పట్టణం రాజావళి ఏరియాలో వాఘ్రాల్‌పడ వద్ద ఒక ఇంటిపై కొండ చరియ విరిగిపడడంతో 45 ఏళ్ల అనిల్ సింగ్, అతని కుమార్తె రోషిణీ సింగ్ (16) అక్కడికక్కడే మృతి చెందారు. తరువాత శిధిలాల నుంచి ఒక మృత దేహాన్ని వెలికి తీశారు. ఆ ప్రాంతం నుంచి 40 కుటుంబాలను వేరే చోటికి తరలించారు.

గుజరాత్‌లో 14 మంది మృతి

అహ్మదాబాద్ : దక్షిణ గుజరాత్, కచ్ సౌరాష్ట్ర రీజియన్లలో గత 24 గంటల్లో భారీగా వర్షాలు కురియడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 31,000 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలించినట్టు బుధవారం అధికారులు తెలిపారు. కచ్, నవసరి, డాంగ్ జిల్లాల్లో మూడు జాతీయ రహదార్లు దెబ్బతినడంతో ట్రాఫిక్ స్తంభించింది. 51 రాష్ట్ర రహదారులు, 400 పంచాయతీ రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మృతి చెందిన 14 మందిలో తొమ్మిది మరణాలు వరద నీటిలో మునిగిపోవడం వల్లనే జరిగాయని విపత్తు నివారణ నిర్వహణ మంత్రి రాజేంద్ర త్రివేది విలేఖరులకు చెప్పారు. ఏయే జిల్లాలు వర్షాలకు దెబ్బతిన్నాయో వెంటనే సర్వే చేయాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారులను ఆదేశించారు. దీనివల్ల బాధితులు నగదు కోసం ఇతర సహాయ కార్యక్రమాల కోసం ఎక్కువ కాలం వేచి ఉండవలసిన అవసరం ఉండదని సిఎం సూచించారు. బుధవారం ఉదయం 6 నుంచి 10 గంటల లోగా, జునాగఢ్, గిర్‌సోమనాధ్, డాంగ్, అమ్రేలి ప్రాంతాల్లో 47 మిమీ నుంచి 88 మిమీ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

31035 మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 21,094 మంది సురక్షిత షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. వాన నీరు తగ్గగానే 9941 మంది తిరిగి ఇళ్లకు చేరుకున్నారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీటిలో 575 మంది చిక్కుకు పోయారని వారందర్నీ రక్షించగలిగామని వివరించారు. 18 రిస్కు బృందాలు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి పటేల్ మంగళవారం చోటా యుడెపూర్, నవసరి, నర్మదా జిల్లాల్లో వరదప్రాంతాలను ఏరియల్ సర్వే చేశారు. రాష్ట్రం లోని వివిధ రిజర్వాయర్లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ సర్దార్ సరోవర్ డ్యామ్ మొత్తం కెపాసిటీలో 48 శాతం వరద నీటితో నిండింది. బుధవారం ఉదయం 6 గంటల వరకు బాహ్రుచ్ జిల్లాలో 233 మిమీ వర్షపాతం నమోదైంది. దాదాపు 25 తాలూకాల్లో 100 మిమీ వర్షపాతం నమోదైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News