తొమ్మిది రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా కొవిడ్ ఉధృతి ఊహించని రీతిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతున్న రాష్ట్రాలను కేంద్రం మరోసారి అప్రమత్తం చేసింది. ముఖ్యంగా 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలని కోరింది. ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తులనుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించింది. తమిళనాడు, పంజాబ్, ఒడిశా, యుపి, ఉత్తరాఖండ్, మిజోరాం, మేఘాలయ, జమ్మూ, కశ్మీర్, బీహార్ రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షలు తక్కువగా చేయడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఓ వైపు కేసుల సంఖ్య, మరో వైపు పాజిటివిటీ రేటు పెరుగుతున్నా టెస్టుల సంఖ్య పెంచకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.ఆశించిన స్థాయిలో కొవిడ్ పరీక్షలు చేయకపోతే వైరస్‌ను కట్టడి చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి ఆహుజా సూచించారు.