Monday, December 23, 2024

యువతకు ఉద్యోగావకాశాలు పెంచుతాం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ గ్యారంటీలతో యువత భవిష్యత్ ఉజ్వలం
పార్టీ ‘రోజ్‌గార్ క్రాంతి’ తెస్తుంది
పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటన

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ‘రోజ్‌గార్ క్రాంతి (ఉపాధి విప్లవం) తీసుకువస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం ప్రకటించారు. యువతకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందని, వారి ఆకాంక్షల సాఫల్యానికి, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సాహానికి పార్టీ ఈ పథకం ద్వారా కృషి చేస్తుందని ఖర్గే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీలతో యువత భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని ఆయన చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో‘యువ న్యాయ్’ గ్యారంటీలను అమలు పరుస్తుందని ఖర్గే పునరుద్ఘాటించారు.

‘కాంగ్రెస్ పార్టీ యువ న్యాయ్ గ్యారంటీ ద్వారా ‘రోజ్‌గార్ క్రాంతి’ తీసుకువస్తుంది. మన యువతకు ఉద్యోగావకాశాలు పెంపుదలకు, పరిశ్రమల స్థాపన దిశగా ప్రోత్సాహానికి, వారి కలలు, ఆకాంక్షల సాఫల్యానికి మేము పటిష్ఠమైన చర్యలు తీసుకుంటాం’ అని ఖర్గే ‘ఎక్స్’చ పోస్ట్‌లో హామీ ఇచ్చారు. ‘యువ న్యాయ్’ పథకం కింద పార్టీ ఇవ్వనున్న గ్యారంటీలను ఖర్గే వివరించారు. ‘భారతీ భరోసా’ గ్యారంటీ కింద తమ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకారం 30 లక్షల కొత్త కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందని, ‘పెహ్లీ నౌకీ పక్కీ’లో భాగంగా ఏడాదికి ఒక లక్ష రూపాయలు వంతున విద్యాధిక యువజనులు అందరికీ ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ హక్కు కల్పిస్తుందని ఖర్గే తెలియజేశారు.

‘పేపర్ లీక్ సే ముక్తి’ గ్యారంటీ కింద పార్టీ అన్ని పేపర్ల లీక్‌లను పూర్తిగా కట్టడి చేయడానికి ఒక చట్టం చేస్తుందని పార్టీ అధ్యక్షుడు తెలిపారు. జిగ్ కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు, సామాజిక భద్రత కల్పిస్తుందని, యువత కోసం రూ. 5000 కోట్ల స్టార్టప్ నిధి ఏర్పాటు చేస్తుందని ఖర్గే తెలియజేశారు. ఐదు న్యాయ్‌లు & నారీ న్యాయ్, యువ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, కిసాన్ న్యాయ్, హిస్సేదారి న్యాయ్ కింద 25 గ్యారంటీలతో లోక్‌సభ ఎన్నికలలో ప్రచారానికి కాంగ్రెస్ వ్యూహం రూపొందించింది. అధికారంలోకి వచ్చినట్లయితే వాటిని అమలు చేస్తామని పార్టీ వాగ్దానం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News