ఏ వ్యాక్సిన్ బూస్టర్‌గా వాడాలో విధానపర నిర్ణయం తప్పనిసరి
ప్రముఖ వైరాలజిస్టులు, ఎపిడెమియోలజిస్టుల అభిప్రాయం
న్యూఢిల్లీ : కరోనాను వ్యతిరేకంగా యాంటీబాడీల సంఖ్యను పెంపొందించే బూస్టర్ డోసు, ఒమిక్రాన్ వేరియంట్ ఇన్‌ఫెక్షన్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి అణగారినప్పుడు బూస్టర్ డోసులు సులువుగా మేలు కలిగిస్తాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్ నియంత్రణలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు ప్రభావవంతంగా పనిచేస్తుందని, ఒమిక్రాన్ నుంచి 70-75 శాతం వరకు మూడో బూస్టర్ రక్షణ కలిగిస్తుందని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకటనకు స్పందిస్తూ ఏ వ్యాక్సిన్ బూస్టర్ డోసు అయినా ( ఓరల్ పోలియో వ్యాక్సిన్ లేదా ఒపివి, పొంగు టీకాలు తప్ప) అమోఘంగా యాంటీబాడీల స్థాయిలను పెంపొందిస్తాయని వైరాలజిస్టులు, ఎపిడెమియోలజిస్టులు పేర్కొన్నారు. రెండు డోసుల తరువాత బూస్టర్ డోసు తీసుకుంటే ఒమిక్రాన్ నుంచి రక్షణ లభిస్తుందని ప్రఖ్యాత వైరాలజిస్టు డాక్టర్ షహీద్ జమీల్ చెప్పారు.
కొవిషీల్డ్ కానీ మరేదైనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొవాగ్జిన్, డిఎన్‌ఎ వ్యాక్సిన్‌గా జైకొవి డి, సీరంకు చెందిన కొవొవాక్స్ ప్రొటీన్ వ్యాక్సిన్, బయోలాజికల్ ఇ నుంచి కొర్బెవ్ యాక్స్ ఇ ప్రొటీన్ ఈ నాలుగు వ్యాక్సిన్లు బూస్టర్లుగా దేశంలో వాడుతున్నారు. అయితే కొవాక్సిన్ , కొవిషీల్డ్ వంటి భారత దేశ వ్యాక్సిన్లు ఎంతవరకు వైరస్‌ను తటస్థీకరిస్తున్నాయో ఒమిక్రాన్ పరంగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని జమీల్ అభిప్రాయ పడ్డారు. ఏ వ్యాక్సిన్ బూస్టర్‌గా వాడాలో ఎవరు ఎప్పుడు ఎలా దీన్ని పొందాలో ఒక విధానాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. ఏ వ్యాక్సిన్ బూస్టర్ డోసైనా యాంటీబాడీ స్థాయిని పెంచుతుందని, ముఖ్యంగా ఫైజర్ వ్యాక్సిన్ వల్ల 40 రెట్లు యాంటీబాడీల స్థాయి పెరుగుతుందని ప్రఖ్యాత వైరాలజిస్టు డాక్టర్ టి. జాకబ్ సూచించారు.
వ్యాధినిరోధక శక్తి అణగారిన సీనియర్లకు, ఇతర వ్యాధిగ్రస్తులకు క్షేమం కలిగించడానికి బూస్టర్స్ సులువైన మార్గమని అభిప్రాయపడ్డారు. పిల్లలు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పొందాలని ఐసిఎంఆర్ మాజీ డైరెక్టర్ జాన్ సూచించారు. లేకుంటే ఒమిక్రాన్ బారిన పిల్లలు పడతారని హెచ్చరించారు. ప్రతివారికీ బూస్టర్ తప్పనిసరి అనిపిస్తోందని ఎపిడెమియోలజీ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర ఆర్ బాబు అభిప్రాయపడ్డారు. బూస్టర్ డోసు ప్రాధాన్యాన్ని నిర్ణయించడానికి డేటా అవసరమని సూచించారు. ఇదే అభిప్రాయాన్ని డాక్టర్ చంద్రకాంత్ లహారియా వెల్లడించారు.