న్యూఢిల్లీ : కొవిడ్ కేసులు పెరుగుతుండటం, ఇది నాలుగోవేవ్‌కు సంకేతాలంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) అదనపు డైరెక్టర్ సమీరన్ పాండ కీలకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం కొవిడ్ కేసులు పెరుగుతుండటాన్ని నాలుగో వేవ్‌గా పరిగణించరాదని చెప్పారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ జిల్లాల స్థాయిల్లో కేసుల పెరుగుదల కనిపిస్తోందని, దాని ఆధారంగా యావద్దేశం నాలుగో దిశగా వెళ్తున్నట్టు చెప్పడం సరికాదని పేర్కొన్నారు. టెస్టింగ్ రేషియో ఆధారంగా కొన్ని లోకల్ స్థాయిల్లో కేసుల పెరుగుదలను గుర్తించామని , దాని అర్థం రాష్ట్రాలన్నీ కొవిడ్ గుప్పిట్లో ఉన్నట్టు కాదని వివరించారు. దేశ వ్యాప్తంగా చూసినప్పుడు ఆస్పత్రి అడ్మిషన్లు పెరగలేదని మరో కారణం చెప్పారు. అదే కాకుండా ఇంతవరకు కొత్త వేరియంట్ ఏదీ గుర్తించనందున ఇప్పటికిప్పుడు నాలుగో వేవ్ వస్తుందనడానికి ఎలాంటి సంకేతాలు లేవని వివరించారు. పాజిటివిటీ రేటుపై మాట్లాడుతూ పరీక్షలు తగ్గడం వల్ల పాజిటివిటీ రేటు ఒక్కోసారి పెరగవచ్చని అన్నారు.