వాషింగ్టన్: భారత్‌లో కొవిడ్19 వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడం వల్ల ప్రపంచానికి అది ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని బైడన్ పాలనా యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొన్నది. భారత్‌లో ఇటీవల కొవిడ్ ఉధృత రూపం దాల్చడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిందని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నెడ్‌ప్రైస్ అన్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఖ్వాడ్(ఆస్ట్రేలియా, భారత్,జపాన్,అమెరికాల కూటమి) సమావేశంలోనూ ఇదే అంశంపై చర్చించినట్టు ఆయన తెలిపారు. సంక్షోభ సమయంలో అమెరికా నుంచి భారత్‌కు 50 కోట్ల డాలర్ల విలువైన సహాయం అందించామని గుర్తు చేశారు. తమ దేశంలో అదనంగా మిగిలిన 2.50 కోట్ల డోసుల టీకాలను భారత్‌సహా ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని గురువారం బైడెన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తమ దేశంలో మొత్తం 5.50 కోట్ల డోసులమేర మిగులు ఉంటుందని నెడ్‌ప్రైస్ తెలిపారు.