Sunday, December 22, 2024

యువత సద్వినియోగం ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోమంటున్నారు ఆర్ధికవేత్తలు. పని వయసులోని వారు జనాభాలో అత్యధిక శాతంగా వున్నప్పుడే దేశాన్ని సంపన్నం చేసుకొని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టాలని హితబోధ చేస్తున్నారు. లేకపోతే దేశం ఇంకో పాతికేళ్లకు సైతం ఎక్కడున్న గొంగళి అక్కడే అన్నట్టు వుంటుందని, అప్పటికి యువకుల జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగిపోయి వెనుకబడిన దేశంగానే వుంటుందని హెచ్చరిస్తున్నారు. ఇందులో నమ్మకూడనిది, అవాస్తికమైనది కనిపించడం లేదు. దేశ సంపద ఐదు ట్రిలియన్ డాలర్ల వైపు పరిగెడుతున్నదని నిత్యం ఆత్మస్తుతికి పాల్పడడం వల్ల ఫలితం లేదు. ప్రజలు నిరుద్యోగులుగా కుంగి కునారిల్లినంత కాలం ఇంతే సంగతులు. అదానీలు, అంబానీల సంపద పెరగడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ వుండదు. ఆశ్రిత పెట్టుబడి పోకడలతో దేశీయ మార్కెట్ నుంచి తమకు తాముగా మాత్రమే బాగుపడే కార్పొరేట్ సంస్థల అభివృద్ధిని దేశాభివృద్ధిగా ఎంత మాత్రం చూడలేము.

ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగంలో మగ్గుతున్న యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించి సమ్మిళిత అభివృద్ధి బాటలో పరిగెత్తించినప్పుడే దేశం అసలైన బాగును చూరగొంటుంది. అదే సరైన పాలన అవుతుంది. భారత దేశ జనాభా 140 కోట్లు అయితే 60 కోట్ల మంది 18 -35 సంవత్సరాల మధ్యలోని యువత. వీరిలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారు. ఈ స్థితి 2055- 56 వరకు కొనసాగుతుందని 2041 ప్రాంతాల్లో గరిష్ఠ స్థాయికి చేరుకొంటుందని నిపుణులు చెబుతున్నారు. వీరి మేధను, శ్రమను వినియోగించి తయారీ రంగాన్ని పుష్కలంగా పెంచుకోగలగాలి. కార్మిక శక్తి నైపుణ్యాలను, సాన బెట్టుకొని నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్‌కు పంపించగలిగి ఎగుమతులను పరాకాష్ఠకు తీసుకు వెళ్ళగలిగితే తప్ప దేశం దీటైన ఆర్ధిక శక్తి కాబోదని సూచిస్తున్నారు.

అలాగే సంపద సృష్టిలో మహిళలను విశేషంగా భాగస్వాములను చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాలను బట్టి 2022 నాటికి దేశం లోని మహిళల్లో 24% మంది మాత్రమే కార్మికులుగా వున్నారు. మిగతా వారు గృహిణులు గానే కొనసాగుతున్నారు. తయారీ రంగం కార్మిక శక్తిని విశేషంగా ఆకర్షించలేకపోతున్నది. దేశ ఆర్ధిక వృద్ధిలో ప్రస్తుతం సేవల రంగమే గణనీయమైన పాత్ర పోషిస్తున్నది. కార్మిక శక్తి లో 30.7% మంది సేవల రంగంలోనే వున్నారు. 2022లో అంతర్జాతీయ సగటు నిరుద్యోగ రేటు 6.8 అయితే, భారత దేశంలో ఇది 9.3 శాతంగా వున్నది. అంటే దేశంలో అందుబాటు లోని అపార యువశక్తి వృథాగా వీధులు కొలుస్తున్నారని స్పష్టపడుతున్నది. అందుకే రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇటీవల మంథన్ సదస్సులో మాట్లాడుతూ ఇండియా ఆర్థిక రంగం నత్తను తలపిస్తున్నదని హెచ్చరించారు.

యువ భారతాన్ని సకాలం లో సద్వినియోగం చేసుకోలేకపోతే ప్రధాని మోడీ చెప్పిన అమృత కాలానికి (2047) దేశం ఇంకా దిగువ మధ్యతరగతి దేశంగానే వుంటుందన్నారు. ప్రస్తుత 6 శాతం వృద్ధి రేటుతో 5 ట్రిలియన్ ఆర్ధిక వ్యవస్థ సాధ్యం కాదని చెప్పారు. ప్రధాని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి వ్యూహం గందరగోళంగా వున్నదనడం అసత్యం కాదు. దాని మేక్ ఇన్ ఇండియా ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. తయారీ రంగంలో నాణ్యమైన ఉత్పత్తులు లేవు. పర్యవసానంగా ఎగుమతులు పెరగడం లేదు. దిగుమతుల ఖర్చును తట్టుకోగలిగే విధంగా సొంత విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచుకోలేకపోతున్నాము. సామాజిక రంగంలో మితవాద దృష్టి కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి బదులు నిరుత్సాహ పరుస్తున్నది.

అందుచేత విదేశీ వాణిజ్య లోటును తగ్గించుకోడంపై దృష్టి పెట్టి యువ భారతాన్ని గరిష్ఠంగా ఉపయోగించుకోవాలి. కాని మన బిజెపి ప్రభుత్వం యువతను మతోన్మాదంలోకి దించి చేతులు దులుపుకొంటున్నది. చైనా వంటి దేశాల పొరుగున ఉండి కూడా మనం నాణ్యమైన, చవకైన ఎగుమతుల మీద దృష్టి పెట్టలేకపోతున్నాము. విదేశీ సంస్థలు ఇక్కడకు వస్తే వాటి ఉత్పత్తుల వల్ల మేకిన్ ఇండియా సఫలమవుతుందని ఆశించాము. అది విజయవంతం కాలేదు. కులగణన వంటి నూతన మార్గాలను ఆశ్రయించి యువతను వడకట్టి కింది నుంచి వారిని నిపుణవంతులను, శాస్త్రీయ విద్యావంతులను చేయడం ద్వారా నిజమైన సామాజిక విప్లవం సాధించాలి. యువతను అభివృద్ధి చోదక శక్తిని చేయాలి. అప్పుడే భారత దేశం ప్రపంచంలోనే అగ్రతర శక్తి కాగలుగుతుంది. మిగతా దేశాలన్నీ తన వైపు చూసేలా చేసుకోగలుగుతుంది. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం తనంత తాను మనల్ని వరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News