న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకం(ఎన్‌ఆర్‌ఇజిఎస్) కింద చెల్లిస్తున్న రోజువారీ వేతనాలు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా లేవని పార్లమెంటరీ కమిటీ గురువారం ప్రభుత్వానికి తెలిపింది. ఈ పథకానికి కార్మికుల కొరత ఏర్పడడం వెనుక ఇది కూడా ఒక కారణం కావచ్చని కమిటీ అభిప్రాయపడింది. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు చెల్లించే వేతనాలు వివిధ రాష్ట్రాల మధ్య వేర్వేరుగా ఉన్నాయని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌కు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం లోక్‌సభకు సమర్పించిన తన నివేదికలో తెలిపింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అతి తక్కువగా రూ. 221 ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో రూ. 224, బీహార్, జార్ఖండ్‌లో రూ.228, సిక్కింలోని మూడు గ్రామ పంచాయతీలలో(ఘతంగ్, లాచుంగ్, లాచెన్)లో
రూ. 354, నికోబార్‌లో రూ. 328, అండమాన్‌లో రూ. 311 వంతున రోజువారీ వేతనాలు ఉన్నాయని కమిటీ తెలిపింది. 2008 నుంచి చెల్లిస్తున్న వేతనాలను పరిశీలించిన కమిటీ ప్రస్తుతం చెల్లిస్తున్న రోజువారీ వేతనాలు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా లేవని కమిటీ అభిప్రాయపడింది. ఉపాధి హామీ కూలీల కంటే ఎక్కువ వేతనాన్ని వ్యసాయ కూలీలు, తాపీ పనులు చేసే కార్మికులు పొందుతున్నారని కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా కనీస వేతనాలపై కేంద్ర ప్రభుత్వం నిమయించిన అనూప్ సత్పతి కమిటీ ఇచ్చిన నివేదికను ఉటంకిస్తూ ఉపాధి హామీ పథకం కూలీలకు రోజువారీ వేతనం రూ. 375 ఉండాలని ఆ కమిటీ సిఫార్సు చేసిందని తెలిపింది. వేతనాలను తగిన రీతిలో పెంచాలని గ్రామీణాభివృద్ధి శాఖకు కమిటీ సూచించింది.