Tuesday, January 21, 2025

వ్యక్తిగత భద్రత పెంచండి : రఘునందన్‌రావు

- Advertisement -
- Advertisement -

దుబ్బాక ఘటనలో పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బంద్ పోస్టర్లు వేయడం ఏ మేరకు సమంజసమని.. తన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. మంగళవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను ఆయన కలిశారు. దుబ్బాక ఘటన, సిద్దిపేట పోలీస్ కమిషనర్ పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోపోతే ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలుస్తామని ఆయన వెల్లడించారు.

అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులకు ప్రతిపక్ష నేతల ఎమ్మెల్యేలు కనిపించడం లేదా? అని రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో బిఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు భద్రతను పెంచాలని ఇంటెలిజెన్స్ అదనపు డిజి ఉత్తర్వులు ఇచ్చారని ఆయన ఆక్షేపించారు. బిజెపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కారా..? అని ప్రశ్నించినా ఆయన.. తనకు భద్రత పెంచాలని రెండు నెలల క్రితం డిజిపికి వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదని తెలిపారు. ఇంటెలిజెన్స్ అదనపు డిజిపై ఇసికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికార పార్టీ ఏజెంట్లుగా పని చేస్తున్న సిద్దిపేట పోలీసు అధికారులు.. గతంలో తాము వ్యక్తం చేసిన అనుమానాలను నిజం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తాము ఖండించాక.. బిజెపి కార్యాలయాలు, కార్యకర్తలపై బిఆర్‌ఎస్ దాడులకు పాల్పడితే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆక్షేపించారు. కాంగ్రెస్ వారు దాడి చేశారని సిఎంతో సహా అందరూ చెబితే దుబ్బాక బిఆర్‌ఎస్ నేతలు మాత్రం రఘునందన్‌రావు దాడి చేయించారని బంద్‌కు పిలుపు ఇచ్చారని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బంద్ పోస్టర్లు వేయడం ఏ మేరకు సబబని ఆయన ప్రశ్నించారు. సిద్ధిపేట పోలీసుల తీరుపై అక్టోబర్ 13న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసాము. సిద్ధిపేట సిపి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా మాకు న్యాయం జరగకపోతే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం.

Raghunandan-Rao-2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News