మన తెలంగాణ/హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ పరిధి డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు విద్యార్థి గుర్తింపు ఫీజు,విద్యార్థి సంక్షేమ నిధి, టోర్నమెంట్ ఫీజులు తగ్గించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎల్. మూర్తి డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ పెంచిన అన్ని రకాల ఫీజుల ఉత్తర్వులను వెంటనే వాపసు తీసుకోవాలన్నారు.
గతంలో విద్యార్థి రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, విద్యార్థి గుర్తింపు ఫీజు, విద్యార్థి సంక్షేమ నిధి, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఫీజులు సుమారు రూ. 900 వరకు ఉండేవని, ప్రస్తుతం ఆ ఫీజులు రూ. 2500లకు పెంచడంతో విద్యార్థులపై రూ.1600 అదనపు భారం పడుతుందన్నారు. పెంచిన యూనివర్సిటీ ఫీజులతో పాటు పరీక్ష ఫీజులు చెల్లించడం విద్యార్థులకు పెను భారంగా ఉందని, తక్షణమే ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు విద్యార్థుల ఆర్థిక స్థోమత గురించి ఆలోచించకుండా ఫీజులు పెంచడం ఆలోచనా రాహిత్యమని మండిపడ్డారు. ఇటువంటి చర్యలతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.