తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్
632 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ
ఉద్యమంలా సాగిన సిఎం కెసిఆర్ చేపట్టిన హరిత హారం పథకంతో సత్ఫలితాలు
రెండేళ్లలో 2,261చదరపు కిలోమీటర్లు పెరిగిన అడవులు, చెట్లు
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టును విడుదల చేసిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అటవీ విస్తీర్ణం పెరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను మంత్రి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను ఆయన వెల్లడించారు. దేశంలో 80.9 మిలియన్ హెక్టార్లలో అడవులు, చెట్ల విస్తీర్ణం ఉన్నట్లు మంత్రి చెప్పారు. గడచిన రెండేళ్లలో దేశంలో 2,261 చదరపు కిలోమీటర్ల మేర అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఉందని తెలిపారు. గడచిన రెండేళ్లలో ఎపిలో గరిష్ఠంగా 647 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుదల నమోదయిందని తెలిపారు. తర్వాతి స్థానాల్లో తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలున్నాయి. తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణంలో పెరుగుదల నమోదయిందని తెలిపారు. ఒడిశాలో 537 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగిందని మంత్రి తెలిపారు. తెలంగాణలో పచ్చదనం పెరగడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గత రెండు మూడేళ్లగా ఉద్యమం తరహాలో చేపట్టిన హరిత హారం, పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు తీసుకున్న చర్యలే ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
2019 నివేదికతో పోలిస్తే గడచిన రెండేళ్లలో 1540 చదరపు కిలోమీటర్ల మేర అడవులు, 721 చదరపు కిలోమీటర్ల మేర చెట్లుపెరిగాయని భూపేంద్ర యాదవ్ చెప్పారు. దేశంలో దాదాపు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 33 శాతం మేర అడవులు, చెట్ల విస్తీర్ణం ఉంది. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్‌లో 70 శాతానికి పైగా అడవులు, చెట్ల విస్త్తీర్ణం ఉన్నట్లు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వెల్లడించింది. దేశంలో పచ్చదనం పెరగడం సంతోషదాయకమని మంత్రి అన్నారు. గ్రీన్ మిషన్ రెండో దశలోకి మనం అడుగు పెట్టామని,దేశంలో పచ్చదనాన్ని మరింత పెంచడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి తమ మంత్రిత్వ శాఖ అనుక చర్యలు తీసుకొందని చెప్నారు.
2030 నాటికి 2.53 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌కు సమానమైన అదనపు కర్బన ఉద్గారాల తగ్గింపును సాధించడం కోసం రాబోయే అయిదేళ్లలో గ్రీన్ మిషన్ రెండో దశ ద్వారా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచడానికి నగర వన యోజనను ప్రారంభించడం జరిగిందని మంత్రి తెలిపారు. బిట్స్ పిలాని గోవా క్యాంపస్‌తో కలిసి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఈ నివేదికను రూపొందించింది. రాబోయే కాలాల్లో అంటే 2030, 2050, 2085 సంవత్సరాలకు కంప్యూటర్ ఆధారిత ఉష్ణోగ్రత, వర్షపాతం అంచనా డేటాలను ఉపయోగించి దేశంలోని అటవీ ప్రాంతాల్లో వాతావరణ హాట్‌సాట్‌లను గుర్తించాలనే లక్షంతో ఈ అధ్యయనాన్ని చేపట్టారు.