Thursday, November 14, 2024

పెరిగిన నిరుద్యోగం!

- Advertisement -
- Advertisement -

Increased unemployment in India నిరుద్యోగ భూతం మళ్ళీ విర్రవీగుతున్నది. కార్మిక శక్తి కేంద్రీకృతమయ్యే పారిశ్రామిక, వ్యాపార రంగస్థలమైన పట్టణ ప్రాంతంలోనే ఉద్యోగాల లభ్యత భారీగా తగ్గిపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ల భయంకర పీడకలల కాలం అంతరించి చాలా మాసాలైన తర్వాత కూడా ఉపాధి, ఉద్యోగాలు పెరగకపోడానికి తాజా వొమిక్రాన్ వేరియన్ట్‌తో బాటు వస్తు వినియోగిత పెరగకపోడాన్ని, దాని ఫలితంగా పారిశ్రామిక తయారీ రంగం పుంజుకోకపోడాన్ని కారణాలుగా చూపుతున్నారు. పట్టణ ప్రాంతంలో నిరుద్యోగం, కరోనాలే ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత నెల డిసెంబర్‌లో నమోదయిన 7.91శాతం నిరుద్యోగ పెరుగుదల రేటు, గత నాలుగు మాసాల్లో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉందని భారత ఆర్ధిక పరిశీలక సంస్థ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) వెల్లడించింది. దీనిని తీవ్ర హెచ్చరికగా భావిస్తున్నారు. గత నవంబర్ లో ఈ రేటు 7 శాతంగా, అక్టోబర్‌లో 7.75 శాతంగా వుంది. అక్టోబర్ లో పేట్రేగి నవంబర్‌లో ఉపశమించిన రేటు మళ్ళీ డిసెంబర్‌లో పెరగడం గమనించవలసిన విషయం. ఆగస్టులో 8.3 శాతం వద్ద తడాఖా చూపిన నిరుద్యోగ పెరుగుదల తిరిగి డిసెంబర్‌లో దాదాపు ఆ స్థాయికి చేరుకొన్నది. గత నెలలో పట్టణ ప్రాంత నిరుద్యోగ రేటు 9.30 శాతం కావడం, అదే సమయంలో గ్రామీణ నిరుద్యోగ పెరుగుదల 7.28 శాతంగా ఉండడం గమనార్హం. పారిశ్రామిక తయారీ, ఉత్పత్తి, నిర్మాణాది రంగాలు కేంద్రీకృతమయ్యే పట్టణ ప్రాంతం ఉద్యోగ ఉపాధి కల్పనలో ఇలా డీలా పడిపోడం దేశ ఆర్ధిక విధాన కర్తలకు అతి పెద్ద సవాలు. నిరుద్యోగంతో బాటు, చిరుద్యోగం, గట్టిగా పది రోజులైనా ఉంటుందో ఊడుతుందోననే అభద్రతాయుత పరిస్థితి దట్టంగా అలముకొన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రపంచమంతటా వొమిక్రాన్ మళ్ళీ భీతావహ పరిస్థితిని సృష్టించింది. అయితే మన దేశంలో పాలకులు ఉద్యోగ కల్పన లక్ష్యంగా, సవాలుగా తీసుకొని నిరుద్యోగాన్ని రూపుమాపడానికి తగిన వ్యూహ రచన చేసి ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం లేదు. అలా చేసి ప్రజల మన్ననలు పొందాలని దీక్ష వహించడం లేదు. మతానికి, దానికి సంబంధించిన భావజాల, దురభిమాన వ్యాప్తికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని దేశంలో మానవాభివృద్ధి సూచీ గణనీయంగా పుంజుకొనేలా చేయడానికి కేటాయించడం లేదు. 2019లో యువతరంలో నిరుద్యోగ పెరుగుదల రేటు 23.1గా వుంది. ప్రస్తుత నిరుద్యోగ విర్రవీగుడు మూలాలు ఇటీవలి గతంలోనూ ఉన్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం విధించిన పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను అస్తవ్యస్త అమలు చిన్నవ్యాపార పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా నష్టపరిచాయి. ఉద్యోగాలు చేయడానికి తగినంతగా యువత ఉన్నప్పటికీ వారిని చేర్చుకొనే స్థాయికి పారిశ్రామిక రంగం వృద్ధి కాలేదు.

స్వయం ఉపాధి రంగమూ పుంజుకోలేదు, సాంకేతిక విద్యలో పట్టభద్రులు కోకొల్లలుగా తయారవుతున్నారు. కానీ పరిశ్రమలకు అవసరమైన స్థాయి నైపుణ్యాలు వారిలో కరవుకావడంతో వారు కూడా నిరుద్యోగ జన సంఖ్యను పెంచుతున్నారు. పారిశ్రామిక వికేంద్రీకరణ నత్త నడకగా సాగుతున్నది. విదేశీ పెట్టుబడులను విశేషంగా ఆకర్షించేందుకు కార్మిక చట్టాలను సవరించి వారి హక్కులను హరించడానికి సైతం కేంద్ర ప్రభుత్వం వెనుకాడడం లేదు. కాని అది ఫలిస్తున్న జాడ లేదు. ఆర్ధిక వృద్ధిరేటు పెరుగుతున్నా ఉద్యోగాల లభ్యతలో అది ప్రతిఫలించకపోడం మరొక సమస్యగా వుంది. చదువుకొంటున్న యువత ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టితో ఏళ్ళ తరబడి కాలక్షేపం చేయడం, తమకు జీవితంలో ఉద్యోగం రాదనే నైరాశ్యంలో కూరుకుపోడం సర్వసాధారణమైపోయింది. ఇటువంటి యువతను సమీకరించి సంపద సృష్టిలో భాగస్వాములను చేయాలి.

వంద కోట్ల వయోజనులున్న ఇండియాలో వేతన ఉద్యోగులు ఎనిమిది కోట్ల మందే కావడం గమనార్హం. మిగతా 92 కోట్ల మంది ఏమి చేస్తున్నట్టు? ఈ పరిస్థితి సంపూర్ణంగా మారాలి. డిసెంబర్ నెలలో మళ్ళీ అత్యధిక స్థాయికి చేరిన నిరుద్యోగ పెరుగుదల కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి వొమిక్రాన్ భయాలతో మరింత ఉధృతం అయ్యే ప్రమాదం లేకపోలేదు. లాక్‌డౌన్‌లకు తొందరపడకుండా తగిన జాగ్రత్తలతో పారిశ్రామిక రంగం పుంజుకొనేలా చూడాలి. ఎక్కడికక్కడ పని పాట్లు కల్పించే చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు విశేషమైన దన్ను ఇవ్వాలి. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా యువతకు నైపుణ్యాలు కల్పించడం, ప్రభుత్వ వ్యయాన్ని అధికం చేసి ఉద్యోగ ఉపాధులను పెంచాలి. వొమిక్రాన్ వ్యాప్తిలో తప్ప ప్రాణాంతక వ్యాధి కాదని వస్తున్న సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలోని ఉత్పత్తి రంగం ఉత్సాహాన్ని నీరుకారకుండా జాగ్రత్తలు పాటించాలి. పట్టణ ఉద్యోగిత పుంజుకొనేలా చేయడంపై ప్రభుత్వ వ్యూహకర్తలు దృష్టి సారించాలి. లేని పక్షంలో సమాజం చాలా అనర్ధాలను ఎదుర్కోవలసి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News