Sunday, November 17, 2024

పెరుగుతున్న వ్యవసాయ కూలీలు తగ్గుతున్న గ్రామీణ ఉపాధి!

- Advertisement -
- Advertisement -

నేటికీ వ్యవసాయ రంగం దేశానికి కీలకంగా ఉంది. సేద్యపు పనుల్లో, పంటల ఉత్పత్తిలో వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతాంగం ముఖ్య భూమిక వహిస్తున్నారు. వీరు పొలంలో కష్టపడితేనే సేద్యం ముందుకు సాగుతుంది. ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఆహార పంటల ఉత్పత్తి జరుగుతుంది. వ్యవసాయ రంగానికి ఇంత కీలకమైన వ్యవసాయ కూలీల, చిన్న రైతుల పరిస్థితులు మాత్రం దుర్భరంగా మారాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భూమి లేని వ్యవసాయ కూలీల సంఖ్య 14 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఈ వీరి సంఖ్య బాగా పెరిగింది.

గ్రామీణ ప్రాంతాల్లో 35.5 కోట్ల మంది కూలీలు ఉండగా, వారిలో 61.5% మంది వ్యవసాయ రంగంలో, 20% పారిశ్రామిక రంగంలో పని చేస్తున్నారు. మిగతా కూలీలు వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. దేశంలో వ్యవసాయ కూలీల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. అందుకు కారణం పాలకు ప్రభుత్వాలే. పాలకుల విధానాల మూలంగా వ్యవసాయం గిట్టుబాటు కాక రైతాంగం అప్పుల పాలై ఉన్న కొద్ది పాటి భూమిని అమ్ముకుని ఇతరుల పొలాల్లో కూలీలుగా పని చేస్తున్నారు.

వ్యవసాయ రంగంలో మహిళలు

దేశ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల్లో 72% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలోని 84% మంది మహిళలు జీవనాధారం కోసం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. అందులో 33% రైతులు కాగా, 47% మంది రైతు కూలీలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని మొత్తం మహిళా కార్మికుల్లో 55% మహిళలు కూలీలుగా ఉన్నారు. 24% మంది సాగు చేసే రైతులుగా ఉన్నారు. ఇప్పుడు దేశంలో మహిళా కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగి ఉంటుంది. 2011 తర్వాత జనాభా లెక్కలు జరగక పోవటంతో వివరాలు అందుబాటు లేవు.

వ్యవసాయ పనులు సీజనల్ వారీగా జరుగుతాయి. నాట్లు, కోతలు, కుప్పలు వేయటం, నూర్చటం, రబీలో వరి నాట్లతో పాటు మొక్కజొన్న, జొన్న తదితర పంటల విత్తనాలు వేయటం, ఆ పంటలు కోయటం సీజన్ పనులుగా ఉన్నాయి. ఈ పంటలతో పాటు మిర్చి, పత్తి, వేరుశనగ పంటలు కూడా సాగు చేస్తున్నారు. 1990 వరకు సంవత్సరంలో వ్యవసాయ పనులు 120 రోజుల వరకు ఉండేవి. క్రమంగా కూలీల సంఖ్య పెరగటం, ప్రాంతాలను బట్టి పనులు ప్రారంభం కావటం, ముందుగా పనులు ప్రారంభమైన ప్రాంతాలకు మిగతా ప్రాంతాల పేదలు పనులకు వెళ్లటంతో కూలీల సంఖ్య పెరిగి త్వరగా పనులు కావటమే కాకుండా, పని దినాలు తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత కాంట్రాక్ట్ పని, అవసరానికి మించి సేద్యంలో యంత్రాల వినియోగంతో లభించే ఉపాధిలో సగం పని దినాలు కూలీలు కోల్పోయారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో యంత్రాలే 80 శాతం పైగా పనులు పూర్తి చేస్తున్నాయి. వ్యవసాయ కూలీలకు నామ మాత్రపు పనులే లభిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో సీజన్‌లో 15 లేక 20 మించి పనులు లభించటం లేదు. సీజన్ -సీజన్ మధ్య ఏర్పడే విరామ సమయంలో ఎటువంటి పనులు ఉండవు.

భారత దేశంలో వేళ్ల మీద లెక్కించబడిన వారి సంపద వేల కోట్లు పెరుగుతుంటే, పంటల ఉత్పత్తికి కారకులైన వ్యవసాయ కూలీల, కూలీ రేట్లు ఏడాదిలో 15 రూపాయల పెరుగుదల మాత్రమే ఉందని కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని లేబర్ బ్యూరో చెప్పింది. 2017 నుంచి వ్యవసాయ కూలీల ఆదాయం ఎంత పెరిగిందనే దానిపై లేబర్ బ్యూరో గణాంకాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా బయటపెట్టింది. వ్యవసాయ రంగంలో ఉపాధి క్షీణించటం వలన పురుష కూలీలు, పేద రైతులు ఉపాధి కోసం పట్టణాలకు వలసలు పోవటంతో వ్యవసాయ రంగంలో సాగుదారులుగా, కూలీలుగా మహిళలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు. 2017 వ్యవసాయ కూలీల దినసరి సగటు కూలి 266 రూపాయలుగా ఉండగా, 2022 ఆగస్టులో 342 పెరిగింది. ఈ కాలంలో ధరల సూచిక 899 పాయింట్ల నుంచి 1152 పాయింట్లకు పెరిగింది.

మహిళా కూలీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వీరి దినసరి కూలి 271 రూపాయలు మాత్రమే. కూలీ రేట్లు పెరిగినట్లు పైకి మాత్రమే కన్పిస్తుంది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పోలిస్తే వాస్తవ దినసరి వేతనం పురుషులకు 207, మహిళలకు 160 రూపాయలకు తగ్గింది. కూలీ రేట్ల నిర్ణయంలోనూ కుల వివక్ష కొనసాగుతూనే ఉందని లేబర్ బ్యూరో నివేదికలో బయటపడింది. 2022 ఆగస్టులో తీసిన లెక్కల ప్రకారం ఎస్‌సిల పురుష కూలీల రోజు వారీ సగటు కూలి 290 రూపాయలు, మహిళల కూలి 269 రూపాయలుగా ఉంది. ద్రవ్యోల్బణం, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కోణంలో చూస్తే వీరి కూలీ రేట్లు తక్కువగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం కూడా గ్రామీణ పేదల ఉపాధి సమస్యను పరిష్కరించలేకపోయింది. వంద దినాల పని కల్పించటంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. జాబ్ కార్డు పొందిన వారిలో 33% మించి పనులు లభించలేదు.

ఈ పథకంలో సాంకేతిక పద్ధతి అమలు చేస్తున్న ఫలితంగా పరిస్థితి గందరగోళంగా మారింది. మొబైల్ యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు, కూలీల డబ్బుల చెల్లింపుల్లో జాప్యం లాంటి సమస్యలతో విసిగిపోయి చాలా మంది ఉపాధి పనులు మానుకుని వేరే పనులకు చేసుకుంటున్నారు. లభించే కూలీ కూడా చాలా తక్కువగా ఉంది. 2022లో లభించిన రోజు కూలి 209 రూపాయలు కాగా, 2023లో 218 రూపాయలుగా ఉంది. పెరిగిన ద్రవ్యోల్బణం ప్రకారం లెక్కలు వేస్తే లభించే కూలి 122 రూపాయలు మాత్రమే. ఇది వ్యవసాయ పనులకు లభించే కూలి కన్నా 100 రూపాయలు తక్కువ. ఈ కూలీ కూడా అనేక రాష్ట్రాల్లో లభించడం లేదు. పెరుగుతున్న నిరుద్యోగం వల్ల తక్కువ కూలైనా లక్షలాది గ్రామీణ పేదలు పని చేస్తున్నారు. దీన్ని గమనిస్తే ఉపాధి సమస్య తీవ్రత తెలుస్తుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల అతి తక్కువ ఆదాయం పొందుతూ దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. ఆర్థిక సర్వే ప్రకారం, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే వారికి లభించే ఆదాయం చాలక అప్పుల పాలు చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ ఆధ్వర్యంలోని జాతీయ గణాంకాల కార్యాలయం గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం 50 శాతం పైగా వ్యవసాయ కూలీ కుటుంబాలు అప్పుల్లో ఉన్నారని తేలింది. గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీల పేదరికానికి, వారి కుటుంబాలు దుర్భర పరిస్థితులకు సేద్యపు భూమికి విడదీయరాని సంబంధం ఉంది. భూమి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉత్పత్తి సాధనం.

అధికార మార్పిడి జరిగి దశాబ్దాలు గడుస్తున్నా పంట ఉత్పత్తులకు మూల కారణమైన పేదలకు సేద్యపు భూమి దక్కలేదు. అర్ధభూస్వామ్య వ్యవస్థకు ప్రాతినిధ్య వహించిన, వహిస్తున్న పాలక ప్రభుత్వాలు చేసిన భూ సంస్కరణల చట్టాలు పేదలకు భూమి పంచకపోగా, భూస్వామ్య వర్గాన్ని మరింత పటిష్ట పరిచింది. దేశం పారిశ్రామికంగా అభివృద్ధి కావాలన్నా, ఉపాధి లభించి పేదలు, పేదరికం నుంచి బయట పడాలన్నా విప్లవ భూ సంస్కరణల ద్వారా పేదలకు భూ పంపిణీ జరగాలి. భూస్వామ్య, బడా పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలక ప్రభుత్వాలేవి అలాం టి భూసంస్కరణలు అమలు జరపవు. ప్రజలే పోరాడి సాధించుకోవాలి.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News