కోల్ ఇండియా వద్ద 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు
ఆందోళన అవసరం లేదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ
న్యూఢిల్లీ: దేశంలోని పలు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఏర్పడిందంటూ వార్తలు రావడంతో విద్యుత్ సంక్షోభంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి స్పందించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ .. బొగ్గు నిల్వలపై ఆందోళన చెందవద్దని అన్నారు. డిమాండ్‌కు సరిసడా బొగ్గు సరఫరాను పెంచుతున్నామన్నారు. సోమవారం రికార్డు స్థాయిలో బొగ్గును సరఫరా చేశామన్నారు. ‘ సోమవారం 1.95 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేశాం. ఇప్పటివరకు ఇదే రికార్డు. ప్రస్తుతం కోల్ ఇండియా లిమిటెడ్ వద్ద 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. వీలయినంత వేగంగా బొగ్గు సరఫరాను మరింతగా పెంచుతాం.
అక్టోబర్ 21తర్వాతనుంచి రోజుకు2 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి చర్యలు చేపడుతున్నాం. భారీ వర్షాలు, అంతర్జాతీయ ధరల కారణంగానే దేశంలో బొగ్గు కొరత సమస్య తెలత్తింది. అయితే ప్రస్తుతం వర్షాలు తుగ్గుముఖం పట్టాయి. బొగ్గు నిల్వలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. వర్షాకాలం తర్వాత సరఫరాను మరింత పెంచేలా చూసుకుంటాం. ప్రజలెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. డిమాండ్‌కు సరిపడా బొగ్గును అందుబాటులో ఉంచుతామని హామీ ఇస్తున్నాం’అని ప్రహ్లాద్ జోషీ చెప్పుకొచ్చారు. మరో వైపు దేశంలో బొగ్గు నిల్వల పరిస్థితిపై ప్రధానమంత్రి కార్యాలయం మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రహ్లాద్ జోషీ,విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌తో సమావేశమై బొగ్గు కొరతపై ఆరా తీసిన విషయం తెలిసిందే.