హైదరాబాద్: స్వచ్ఛమైన నీటిలో పెరిగే తెలంగాణ సేంద్రియ చేపలకు విదేశాలలో మంచి ఆదరణ పెరుగుతున్నదని, సహజంగా పెరుగుతున్న మంచినీటి చేపలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ రోజురోజుకు అధికమవుతోందని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు. కలకత్తా, హౌరా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన చేపల ఎగుమతి సంస్థల ప్రతినిధులు సోమవారం మధ్యాహ్నం ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ను ఆయన చాంబర్లో కలుసుకొని తెలంగాణ చేపల ఎగుమతులకు సంబంధించిన అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా సముద్రపు చేపల ఉత్పత్తి రోజురోజుకు తగ్గుముఖం పడుతున్న కారణంగా ఉపరితల జల వనరులలో పెంచే చేపలకు డిమాండ్ నానాటికి పెరుగుతున్నదని వారు ఈ సందర్భంగా చైర్మన్ కు వివరించారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో సముద్ర తీరం లేని తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయంగా కొనసాగుతున్న చెరువులు, కుంటలు, జలాశయాలలో సహజంగా పెరుగుతున్న చేపలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని వారు ఈ సందర్భంగా ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సముద్ర జల వనరులతో పాటు ఆక్వా కల్చర్ విధానంలో కృత్రిమ దాన వేసి పెంచుతున్న చేపల కంటే స్వచ్ఛమైన నీటిలో సహజ ఆహారాన్ని తీసుకొని పెరుగుతున్న తెలంగాణ చేపలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నదని, చేపల ఎగుమతుల సంస్థలకు చెందిన ప్రతినిధులు వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవతో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం అమలు పరచడం ద్వారా తెలంగాణలో గడచిన 8 సంవత్సరాలుగా చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నదని, రానున్న కాలంలో చేపల ఉత్పత్తిని రెట్టింపు చేయడంతో పాటు అందుబాటులో ఉన్న జల వనరుల అన్నింటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ఫిషరీస్ ఫెడరేషన్ సిద్ధం చేస్తున్నదని ఈ సందర్భంగా పిట్టల రవీందర్ వారికి వివరించారు.
తెలంగాణ చేపలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలున్న మార్గాలను అవసరమైన చర్యలను తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ చేపలను ప్రాసెసింగ్ విధానంలోనూ ఇతర పద్ధతుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంతోపాటుగా మత్స్యకారుల ఆదాయలను కూడా పెంచేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. చేపల ఉత్పత్తి తో పాటు ప్రాసెసింగ్, ప్యాకింగ్, రవాణా తదితర కార్యక్రమాల వల్ల ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగు పడగలవని పిట్టల రవీందర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మత్స్యరంగంలో మహిళ సాధికారికత ను సాధించేందుకు, విదేశాలకు తెలంగాణ చేపలను ఎగుమతి చేయడం ద్వారా అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ను కలిసిన చేపల ఎగుమతుల సంస్థల ప్రతినిధులలో వీర భద్రం, జొన్నాడ సుబ్బారావు, అవినాష్ సింగ్ తదితరులు ఉన్నారు.