Monday, January 20, 2025

అటవీ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యం

- Advertisement -
- Advertisement -

ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్

మనతెలంగాణ/హైదరాబాద్:  మారుతోన్న వాతావరణ పరిస్థితులలో అటవీ వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతోందని, కీలకమైన విభాగంగా ఎదుగుతోందని భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్. కె చౌదరి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఝాన్సీ లోని అఖిలభారత సమన్వయ పరిశోధన పథకం (అగ్రోఫారెస్ట్రీ) సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహిస్తున్న వార్షిక గ్రూపు మానిటరింగ్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, సోమవారం సదస్సుని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ వ్యవసాయంకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి, మన వాతావరణ పరిస్థితులకనుగునంగా వాటిని అమలుపరచాలని సూచించారు. నాణ్యమైన అటవీ మొక్కలు అభివృద్ధి పరచడం పై శాస్త్రవేత్తలు దృష్టినిలపాలని, సామర్ధ్య పెంపుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు. భవిష్యత్తు అవసరాల కనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను పాటించడంలో అగ్రో ఫారెస్ట్రీ కీలక పాత్ర పోషించనున్నదని అన్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ అగ్రొఫారెస్ట్రీలో ‘నేటివ్ స్పీసిస్‘ ను గుర్తించి వాటిని అభివృద్ధి పరచడానికి కృషి చేయాలి అన్నారు. అగ్రో ఫారెస్ట్రీ అఖిల భారత సమన్వయ పథకం పురోగతిని ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ అరుణాచలం వివరించారు. ఈ కార్యక్రమంలో పలు కేంద్రాలు ప్రచురించిన పుస్తకాలను, ప్రచురణలను ఈ సందర్భంగా విడుదల చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో అగ్రివర్శిటి పరిశోధనా సంచాలకులు డాక్టర్ రఘు రామిరెడ్డి, క్రీడా సంచాలకులు డాక్టర్ వి. కె సింగ్, డాక్టర్ ఏ.వి రామాంజనేయులు, వివిధ కేంద్రాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News