Wednesday, January 22, 2025

పెరుగుతున్న పోషకాహార లోపం

- Advertisement -
- Advertisement -

ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలా మంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు. కొందరు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికీ అక్కడక్కడా ఆకలి చావులు నమోదవుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోజుకు 1.25 డాలర్లు (సుమారు రూ.89) లేదా అంతకంటే తక్కువ మొత్తం సంపాదన ఉన్నవారిని పేదలుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 750 కోట్లకు పైగా ఉంటే, సుమారు 140 కోట్ల మంది రోజుకు కనీసం రూ.89 సంపాదనైనా లేని పేదరికంలో మగ్గుతున్నారని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. వీరిలో ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాల్లోనే ఉన్నారు. పేదరికంలో మగ్గుతున్న వారిలో అత్యధికులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సన్నకారు రైతులేనని కూడా ప్రపంచబ్యాంకు లెక్కలు చెబుతున్నాయి.

ఇక ఉద్యోగాల్లోని అస్థిర పరిస్థితుల వల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆహార ధాన్యాలను భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా దేశాల్లో దాదాపు 40% మేరకు తిండి గింజలు వినియోగానికి పనికి రాకుండా నాశనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఆకలి సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. యుద్ధ పరిస్థితులు, సంఘర్షణలతో అతలాకుతలమవుతున్న దేశాల్లోనూ జనం ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు మార్కెట్లలో అస్థిరతల వల్ల ఆహార ధాన్యాలు, ప్రధానమైన పంటల ధరలు ఒక్కోసారి విపరీతంగా పెరగడం, ఒక్కోసారి విపరీతంగా పడిపోవడం వల్ల కూడా తాత్కాలికంగా చాలా మంది ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

దేశ వ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం
దేశ వ్యాప్తంగా పిల్లల్లో పోషకాహార లోపం పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. నీతిఆయోగ్ విడుదల చేసిన మల్టీ డైమెన్షియల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం గుజరాత్‌లో 38.09% కుటుంబాలు పోషకాహార లోపంతో బాధపడుతున్నాయి. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లాంటి వెనుకబడిన రాష్ట్రాలు గుజరాత్ కంటే మెరుగ్గా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. 39% పిల్లలు వయసుకు తగ్గ బరువు లేరని నివేదిక బయట పెట్టింది. 2021లో పశ్చిమబెంగాల్‌లో 27.3%, గుజరాత్‌లో 38.9% కుటుంబాలు పోషకార లోపంతో బాధ పడుతున్నాయి. గుజరాత్‌లో ప్రతి 100 మందిలో ముగ్గురు పోషకార లోపంతో బాధపడుతున్నారు. గృహ నిర్మాణంలో కూడా గుజరాత్ వెనుకబడి ఉందని నీతిఆయోగ్ తెలిపింది. గుజరాత్‌లో 23.30% జనాభాకు గృహ వసతి లేదని వెల్లడించింది. హర్యానా, పంజాబ్, కేరళ కంటే గుజరాత్ వెనుకబడి ఉందని తెలిపింది.

ఐదేళ్ల క్రితం కంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ పోషకాహార లోపంతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2019- 20లో సేకరించిన డేటా ఆధారంగా తాజా నివేదికను తయారు చేశారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తికి ముందు 22 రాష్ట్రాల్లో మాత్రమే ఈ సర్వే జరిపారు. మిగతా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ముగిసిన తరువాత సర్వే చేశారు. కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఫలితాలు మరింత ఘోరంగా ఉండొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దాహోద్‌లాంటి మారుమూల ప్రాంతాల్లో పోషకాహార సమస్య అంతకుముందు నుంచే ప్రారంభమైందని విశ్లేషకులు అంటున్నారు. 2015- 16 సర్వేతో పోలిస్తే ఈ జిల్లాల్లో పిల్లల్లో పోషకాహార సమస్య బాగా పెరిగింది. ఐదేళ్లకన్నా చిన్న పిల్లల్లో పోషకాహార లోపం 44% నుంచీ 55 శాతానికి పెరిగింది. బరువు తక్కువ పిల్లల శాతం 7.8 నుంచి 13.4కు పెరిగింది.

పెరుగుతున్న ఆకలి రాజ్యాలు
ప్రపంచ వ్యాప్తంగా ఆకలి రాజ్యాలు పెరుగుతున్నాయి. సుమారు 828 మిలియన్ల ప్రజలు అంటే జనాభాలో 10% మంది తిండి కోసం అలమటిస్తున్నారు. ప్రతి రాత్రి ఖాళీ కడుపుతో నిద్రకు ఉపక్రమిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆకలి బాధితుల సంఖ్య 46 మిలియన్లు ఎగబాకినట్లు యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆకలితో బాధపడుతున్న వారిలో మూడింట రెండవ వంతు మంది మహిళలు. సుమారు 80% మంది వాతావరణ మార్పులకు గురయ్యే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆకలి స్థాయిల గురించి అవగాహన కల్పించేందుకు ‘ది హంగర్ ప్రాజెక్ట్’ అనే లాభరహిత సంస్థ మే 28ని ‘ప్రపంచ ఆకలి దినోత్సవం’ గా ప్రకటించింది. ఆకలి అనేది పేదరికంతో ముడిపడి ఉన్న సమస్య.

చాలా మంది ప్రజలు ఆకలితో మగ్గిపోవడానికి పలు కారణాలున్నాయి. ప్రకృతి విపత్తులు, వాతావరణ మార్పులు, సంఘర్షణలు, పేదరికం, పోషకాహారం లేకపోవడం ఇలాంటివన్నీ ఆ కోవలోకి వస్తాయి. ఎక్కువ కాలం ఆకలితో జీవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్నారుల్లో శారీరక, మేధోపరమైన లోపాలు ఉత్పన్నమవుతాయి. రోజువారీ ఆహారంలో తీసుకోవాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ తక్కువ క్యాలరీల్లో తీసుకోవడాన్ని పోషకాహార లోపంగా పరిగణిస్తారు. 2018 వరకు ఆకలి సూచీలో తగ్గుదల కనిపించింది. అయితే 2019- 2021 మధ్య కాలంలో పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 150 మిలియన్లు పెరిగింది. సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక మందగమనం సహా కోవిడ్ మహమ్మారి ప్రబలడం కూడా ఈ పెరుగుదలకు కారణమని తెలుస్తోంది.

‘ఆకలి’ బాధలకు ప్రధాన కారణాలు
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆహార ధరల సూచీ ప్రకారం 2019- 2022 మధ్య కాలంలో ఆహార ధరలు విపరీతంగా పెరిగాయి. 95.1 పాయింట్లుగా ఉన్న సూచీ 143.7 పాయింట్లకు చేరింది. ఇది వివిధ ఆహార ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తారు. వాటిలో చక్కెర, మాంసం, ధాన్యాలు, పాల ఉత్పత్తులు, వెజిటబుల్ ఆయిల్స్ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆహార వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అయితే వీటి పెరుగుదల ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంది. కొన్ని దేశాలు ఉత్పత్తులపై వినియోగదారులకు సబ్సిడీలు ఇస్తుంటాయి. ప్రపంచ మార్కెట్ ఆధారంగా ఆ సబ్సిడీల హెచ్చుతగ్గులను నిర్ణయిస్తాయి.

తాజా యుఎన్ స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ నూట్రీషియన్ ఇన్ ది వరల్డ్ నివేదిక ప్రకారం 2021లో 425 మిలియన్ల ఆసియా జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆఫ్రికాలో 278 మిలియన్ల జనాభా పోషకాహార లోపానికి గురయ్యారు. ఒక వ్యక్తికి తగినంత ఆహారం లభించకపోవడం వల్ల వారి జీవితం, జీవనోపాధి తక్షణమే ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి స్థితి 2022లో గణనీయంగా పెరిగింది. ఆహార సంక్షోభంపై 2023లో ప్రచురించిన గ్లోబల్ రిపోర్ట్‌లో 258 మిలియన్ల ప్రజలు తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 2022లో రష్యా- ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధం ఆహార ధాన్యాలు, నూనెగింజలు, ఎరువుల పెరుగుదలకు కారణమైంది. అంతర్జాతీయ సరఫరా గొలుసులో తేడా రావడం వల్ల వీటి ధరలు విపరీతంగా పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News